టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా దర్శకుడిగా, ప్రజా సమస్యలపై తనదైన గళం వినిపించే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సాధారణంగా సినిమాల్లో కీలక పాత్రలు పోషించే అవకాశాలు వచ్చినా తన అభిప్రాయాలకు, ఆలోచనలకు ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్లే ఆయన.. ఇప్పుడు ‘హుషారు 2’లో కనిపించబోతుండటం ఆసక్తికరంగా మారింది. గతంలో ‘టెంపర్’తో పాటు పలు సినిమాల్లో నటించే అవకాశాలను సున్నితంగా తిరస్కరించిన ఆయన.. ఈ సినిమాకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. టీజర్ చివర్లో ఆయన చెప్పిన ‘తమ్ముళ్లు.. వేట మొదలెడదామా’ అనే పవర్‌ఫుల్ డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
అయితే, గతంలో పలు సినిమాల్లో నటించే అవకాశాలను వదులుకున్న ఆర్. నారాయణమూర్తి.. ‘హుషారు 2’కు ఎందుకు అంగీకరించారు? ఈ సినిమాలోని పాత్ర ఆయనకు నచ్చిందా? కథలో ఏదైనా ప్రత్యేకత ఉందా? అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. ఏదేమైనా, ఆర్. నారాయణమూర్తి వంటి ప్రత్యేక గుర్తింపు ఉన్న నటుడు ‘హుషారు 2’లో కీలక పాత్ర పోషిస్తుండటం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. టీజర్ ట్రెండింగ్‌లో ఉండటంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.
పాండవులను రక్షించే కృష్ణుడిలాంటి పాత్ర నాది..: పీపుల్స్ స్టార్
సినిమా పిచ్చితో మద్రాస్, హైదరాబాద్ వంటి నగరాల్లో తిరిగిన నాకు.. చాలా ఏళ్ళ తర్వాత ఒక మంచి పాత్ర వచ్చిందంటూ టీజర్ ఈవెంట్‌లో ఆర్.నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. అలాగే, మూర్తి మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో డైరెక్టర్ హర్ష నాకు గొప్ప పాత్రను ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత మంచి పాత్రను పోషించాను. ఇందులో ఎంత నవ్వించారో.. అంతకుమించి ఆలోచించేలా చేస్తారు. నిరుదోగ్య సమస్యను గొప్పగా చూపించారు. నలిగిపోతోన్న యువతకి స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఆత్మాభిమానంతో బతకాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఇలాంటి గొప్ప చిత్రాన్ని ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు.
ఈ సినిమాలో తన పాత్ర గురించి కూడా చెబుతూ... డైరెక్టర్ శ్రీ హర్ష భారతం తీసుకున్నాడు. మహా భారతంలో పంచపాండవులు లాంటి కుర్రాళ్ళు... అలాంటి కుర్రాళ్ళని శ్రీకృష్ణుడు ఎలా కాపు కాశాడో.. అలాంటి దశలో విలన్ల బారి నుండి కాపాడే వేషం నాది. ముఖ్యంగా ఈ నలుగురి కుర్రాళ్ళు ఒక మంచి పని కోసం విలన్ల వేటలో చిక్కడంతో.. పీడిత ప్రజల బాగు కోసం .. ఈ కుర్రాళ్ళు చేస్తున్న పనికి సపోర్ట్ గా నిలిచే క్యారక్టర్ నాది అని పీపుల్స్ స్టార్ చెప్పుకొచ్చారు.
నక్సల్స్ లీడర్‌గా ఆర్. నారాయణమూర్తి..
‘బాయ్స్ ఆర్ బ్యాక్’ అనే క్యాప్షన్‌తో మొదలైన టీజర్‌లో.. ‘అడవిలో అరుపులు సీజన్ 2’ పేరుతో సినిమా షూటింగ్ చేస్తున్నట్లు చూపిస్తూ కథలోకి తీసుకెళ్లారు. రాహుల్ రామకృష్ణ తన గ్యాంగ్‌తో కలిసి ఓ క్రేజీ ఐడియాను నిజం చేసుకునేందుకు చిత్రగుంజ్‌కు చేరుకోవడం, అక్కడి నుంచి కథ అనూహ్య మలుపులు తిరగడం ఆసక్తికరంగా సాగింది. విలన్ల నుంచి తప్పించుకుంటూ పరుగులు తీసే కుర్రాళ్ల గ్యాంగ్ చివరకు నక్సల్స్ చేతికి చిక్కడం, అక్కడ నక్సల్స్ నాయకుడిగా ఆర్. నారాయణమూర్తి ఎంట్రీ ఇవ్వడం టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి.
►ALSO READ | OTT Fantasy Thriller: ఓటీటీలోకి తెలుగు ఫాంటసీ థ్రిల్లర్.. పిల్లలకు పర్ఫెక్ట్ వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్..
అశోక్ గల్లా, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో యూత్‌ఫుల్ కామెడీతో ఆకట్టుకున్న ‘హుషారు’కు భిన్నంగా.. సీక్వెల్‌లో యాక్షన్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలను మేళవించినట్లు టీజర్ సంకేతాలు ఇస్తోంది. మరి ఈ కుర్రాళ్ల గ్యాంగ్‌ను విలన్లు ఎందుకు వెంటాడుతున్నారు? నక్సల్స్ నాయకుడిగా ఆర్. నారాయణమూర్తి పాత్ర కథను ఏ మలుపు తిప్పనుంది? అన్నది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
