ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంటలకు ఊపిరి..ఈదురు గాలులు, భారీ వర్షాలు లేకపోవడంతో తప్పిన నష్టం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  పంటలకు ఊపిరి..ఈదురు గాలులు, భారీ వర్షాలు లేకపోవడంతో తప్పిన నష్టం
  • పంటలు ఎండుతున్న దశలో రోజంతా వర్షం
  • అక్కడక్కడ నేలకొరిగిన వరి పైర్లు 

ఖమ్మం, వెలుగు:  అర్నాబ్​ తుఫాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులకు మేలు చేసింది. కొద్ది రోజులుగా ఎల్​ నినో ప్రభావంతో కొన్ని చోట్ల వరి పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండగా, తుఫాను కారణంగా రోజంతా వర్షం పడడం పంటలకు ఊపిరిపోసింది. 

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు పెద్దయెత్తున వీస్తాయని అధికారులు ముందస్తుగా హెచ్చరించడంతో రైతులు టెన్షన్​ పడ్డారు. కానీ తుఫాన్​ ప్రభావం అంతగా లేకపోవడం, పైగా పంటలకు అనుకూలంగా మారింది. అక్కడక్కడా పత్తి పంటకు నష్టం జరిగినా, కోతకు వచ్చిన వరి పైరు కొన్ని చోట్ల నేలకూలినా ఎక్కువ మంది రైతులకు మేలే జరిగింది. 

ఉమ్మడి జిల్లా పరిధిలో అత్యధికంగా అశ్వారావుపేటలో 62 మిల్లీ మీటర్లు, దమ్మపేటలో 4‌‌‌‌‌‌0.8, సత్తుపల్లిలో 29, అన్నపురెడ్డిపల్లిలో 28.3, తల్లాడలో 27 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రోజంతా ముసురుపట్టి ఉండడంతో వాతావరణంగా పూర్తిగా చల్లబడింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం విద్యాసంస్థలకు ముందుగానే కలెక్టర్​అంకిత్ సెలవు ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడింది.