హైదరాబాద్, వెలుగు: రాజస్థాన్రాజధాని జైపూర్లో బుధవారం నిర్వహించిన 10వ డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీ మీట్ అండ్ ఎగ్జిబిషన్– 2026లో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ పంపిణీ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, ఉత్తమ విధానాలపై చర్చించేందుకు ఈ జాతీయ స్థాయి సదస్సు వేదికగా నిలిచింది. జైపూర్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్(జేవీవీఎన్ఎల్), ఆల్ ఇండియా డిస్కామ్స్ అసోసియేషన్(ఏఐడీఏ) సహకారంతో ఈ సదస్సు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థల ఉన్నతాధికారులు, విద్యుత్ నియంత్రణ సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని విద్యుత్ పంపిణీ రంగ భవిష్యత్ అవసరాలపై ముఖ్యంగా ఏఐ ఆధారిత డేటా సెంటర్లు, స్మార్ట్ మీటర్ల డేటా నిర్వహణపై చర్చించారు.
విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక బలోపేతం, మూలధన మార్కెట్లకు సిద్ధం కావడం, అధునాతన డేటా విశ్లేషణ, ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేయడం వంటి కీలక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
పంపిణీ నెట్వర్క్ల సామర్థ్యాన్ని పెంచే పరిష్కారాలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విద్యుత్ వ్యవస్థల అభివృద్ధి, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్(బీఈఎస్ఎస్), సైబర్ భద్రత, విద్యుత్ పంపిణీ వ్యవస్థల డిజిటలైజేషన్ వంటి అంశాలపైనా చర్చలు జరిగాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థల తరఫున సదరన్ డిస్కమ్ డైరెక్టర్లు చిలుకమారి చక్రపాణి, టి. మధుసూధన్, చీఫ్ ఇంజనీర్ వెంకట రమణ పాల్గొన్నారు.
