- ‘ఐఆర్‌సీటీ’ విజయ గాథను పంచుకున్న కేంద్ర సామాజిక న్యాయ శాఖ
న్యూఢిల్లీ, వెలుగు: మాదక ద్రవ్యాలకు బానిసై ఆరోగ్య సమస్యలు, ఒంటరితనం, భావోద్వేగాలతో సమాజానికి దూరమైన కరీంనగర్ కు చెందిన ‘నీల్’(పేరు మార్చబడింది) తిరిగి స్వయం సమృద్ధి వైపు మళ్లాడు. నెలకు రూ.15 వేలు సంపాదిస్తూ ప్రస్తుతం కుటుంబానికి ఆసరా నిలుస్తున్నాడు.
ఇంటిగ్రేటెడ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ అడిక్ట్స్(ఐఆర్‌సీటీ) ద్వారా తిరిగి కోలుకున్న నీల్ విజయ గాథను సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ గురువారం మీడియాతో పంచుకుంది. డ్రగ్స్ వ్యసనం నుంచి కోలుకోవడం వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని, సంబంధాలను, ఆర్థిక స్థిరత్వాన్ని పునర్నిర్మించుకోవడానికి సహాయపడుతుందని తెలిపింది.
‘కరీంనగర్‌కు చెందిన 25 ఏండ్ల పట్టభద్రుడు నీల్.. మద్యం, గంజాయికి అలవాటు పడ్డాడు. దాంతో ఆర్థిక అస్థిరత, సామాజిక ఒంటరితనం, భావోద్వేగం, తగ్గిన ఆత్మవిశ్వాసంతో నరకం అనుభివించాడు. ఈ ఎఫెక్ట్ అతని కుటుంబాన్ని మానసికంగా, ఆరోగ్య పరంగా ప్రభావితం చేసింది’ అని పేర్కొంది.
ఐఆర్సీఏ తో ‘నీల్’ జీవితం పున:నిర్మాణం
మత్తుకు బానిసైన నీల్.. ఈ ఏడాది మే 22న కరీంనగర్‌లోని ప్రకృతి ఎన్విరాన్మెంట్ సొసైటీ కి చెందిన ఐఆర్సీఏ లో చేరాడు. వైద్య చికిత్స, డిటాక్సిఫికేషన్, వ్యక్తిగత కౌన్సెలింగ్, బిహేవియరల్ థెరపీ, భావోద్వేగ, మానసిక మద్దతు, కుటుంబ కౌన్సెలింగ్ లను ఐఆర్సీఏ అందించింది. ఇవన్నీ నీల్ కు తన జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి సహాయపడ్డాయి.
ఇప్పుడు మద్యానికి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటోన్న నీల్.. కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకొని, తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పొందాడు. మాదకద్రవ్యాల వ్యసనం నుంచి కోలుకోవడానికి అందుబాటులో ఉండే చికిత్స, వృత్తిపరమైన కౌన్సెలింగ్, కుటుంబ భాగస్వామ్యం, నిరంతర పర్యవేక్షణ ఎంత ముఖ్యమో నీల్ ప్రయాణమే ఉదాహరణ అని ఐఆర్‌సీటీ పేర్కొంది.
