- పర్మిషన్ తీసుకున్నాక పార్కింగ్లేకుండానే నిర్మాణాలు
- ఒకవేళ కట్టినా అద్దెలకే..
- రోడ్లపై వాహనాలు నిలుపుతున్న వినియోగదారులు
- ట్రాఫిక్ సమస్యకు ఇదో కారణం
- ఇల్లు, బిల్డింగు ఏదైనా పార్కింగ్ మస్ట్ గా ఉండాల్సిందే..
హైదరాబాద్ సిటీ, వెలుగు : సిటీలో పార్కింగ్ సమస్య రోజురోజుకూ తీవ్రమైతున్నది. జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటంతో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువవుతోంది. దీనికి తోడు కమర్షియల్, షాపింగ్ కాంప్లెక్సులు, ఆఫీసులు, ఇతర బిల్డింగుల్లో సరిపడా పార్కింగ్ స్పేస్ ఉండటంలేదు.
క్యూర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో ఆస్తిపన్ను చెల్లింపుదారులు 29 లక్షల మంది ఉండగా, దాదాపు 16 లక్షల వరకు బిల్డింగులున్నాయి. వీటిలో సుమారు 2 లక్షల వరకు కమర్షియల్ భవనాలు కాగా, మిగతావన్ని రెసిడెన్షియల్ బిల్డింగులు.
ఇందులో వ్యాపార సముదాయాల యజమానులు అద్దెలు, వ్యాపారాలపై శ్రద్ధ చూపిస్తున్నారు తప్పితే పార్కింగ్ గురించి పట్టించుకోవడం లేదు. భవన నిర్మాణ అనుమతులు తీసుకునే టైంలో పార్కింగ్ స్థలాన్ని చూపిస్తున్నప్పటికీ, చివరకు మార్పులు చేసి పార్కింగ్ స్థలాలను ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారు.
దీంతో కమర్షియల్ కాంప్లెక్సులకు వచ్చేవారు వాహనాలను నిలిపేందుకు స్థలం లేక రోడ్ల పక్కన పార్క్చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు, ఇతర వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
భవనం ఎంతదైనా పార్కింగ్ ఉండాల్సిందే..
భవనం ఎంతున్నా పార్కింగ్ మాత్రం ఉండాలన్న నిబంధన ఉంది. చిన్న స్థలంలో ఇల్లు కట్టుకున్నా వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాల్సిందే. స్థలం విస్తీర్ణాన్ని బట్టి నివాస, వాణిజ్య భవనాలకు పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలి. ఎంత తక్కువ స్థలంలో ఇల్లు కట్టుకున్నా కనీసం ఒక కారుకైనా స్థలం కేటాయించాల్సి ఉంటుంది.
అదే 250 చదరపు మీటర్లకు మించిన స్థలాల్లో నిర్మించే నివాస భవనాలకు స్థల విస్తీర్ణంలో 33 శాతం, కమర్షియల్ భవనాలకు 44 శాతం వరకు పార్కింగ్ కోసం కేటాయించాలి. 750 చదరపు మీటర్లకు మించిన స్థలాల్లో నిర్మాణాలకు పార్కింగ్ కోసం సెల్లార్ అనుమతులు వస్తాయి. పార్కింగ్ కోసం కేటాయించే స్థలంలో నిర్మాణానికి సంబంధించి ఫీజు కూడా ఉండదు. ఇలా సిల్ట్ ప్లస్ రెండు ఫ్లోర్లకు అనుమతులు తీసుకున్నవారు పార్కింగ్ లేకుండా అన్ని ఫ్లోర్లలో నిర్మాణాలు జరుపుతున్నారు.
రెంట్లపైనే ఫోకస్
రెసిడెన్షియల్, కమర్షియల్ బిల్డింగుల ఓనర్లు పార్కింగ్ స్థలాలను అద్దెకు ఇచ్చి అద్దెలు రాబట్టుకోవడంపైనే శ్రద్ధ పెడుతున్నారు. వంద చదరపు మీటర్లలో నిర్మించిన ఇండ్ల నుంచి మొదలుపెడితే ప్రధాన రోడ్లపై ఉండే కమర్షియల్ కాంప్లెక్సుల వరకు ఇదే సీన్ కనిపిస్తోంది. 100 చదరపు మీటర్లలో రెండు నుంచి మూడు ఫ్లోర్లలో నిర్మాణాలు జరుపుతుండగా, ఇంకొందరు అక్రమంగా ఐదారు ఫ్లోర్లు కూడా కట్టి ఆరు నుంచి 10 మందికి రెంట్‌కు ఇస్తున్నారు. దీంతో ఇక్కడికి వచ్చేవారు రోడ్లనే పార్కింగ్స్థలాలుగా మారుస్తున్నారు. దీంతో ట్రాఫిక్పోలీసులు ఛలాన్లు వేస్తుండగా షాపింగ్ చేసినదానికంటే ఎక్కువగానే కట్టాల్సి వస్తున్నది.
యాక్షన్ ఏది సారూ..
పార్కింగ్ స్థలాలను ఇతర అవసరాలకు వాడుతున్న భవన యజమానులపై చర్యలు తీసుకుంటే ఇబ్బందులు తప్పే అవకాశం ఉంటుంది. కనీసం ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్(పీటీఐఎన్) జారీ చేసే టైంలో అయినా పార్కింగ్ స్పేస్ ని చూడటంలేదు. దీని ఆధారంగా ఆయా భవనాల సెల్లార్లలో ఏర్పాటు చేసే వ్యాపారానికి కూడా ట్రేడ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మూడు కార్పొరేషన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు పార్కింగ్ సదుపాయం కల్పించని వారిపై కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
