ఆసియా పారా లిఫ్టర్‌‌ నీరజ్‌‌ ఆత్మహత్య

ఆసియా పారా లిఫ్టర్‌‌ నీరజ్‌‌ ఆత్మహత్య

న్యూఢిల్లీ: ఆసియా పారా గేమ్స్‌‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌‌ యాదవ్‌‌ (42) ఆత్మహత్య చేసుకున్నాడు. తన నివాసంలో విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జపాన్‌‌లో జరిగిన పారా ఆసియా క్రీడలకు దూరం కావడం, డోపింగ్ సస్పెన్షన్ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ మహిళతో స్నేహ సంబంధం ముగియడం కూడా ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 

బుధవారం జీటీబీ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై జాఫ్రాబాద్ పోలీస్ స్టేషన్‌‌లో బీఎన్‌‌ఎస్ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గత డిసెంబర్‌‌ నుంచి నీరజ్‌‌ యాదవ్‌‌తో స్నేహంగా ఉన్న ఓ మహిళ.. మంగళవారం హర్యానా సోనిపట్‌‌లో అతన్ని కలిసినట్లు సమాచారం. ఇకపై సంబంధంలో కొనసాగలేమని ఆమె నీరజ్‌‌తో చెప్పినట్లు తెలుస్తోంది. తర్వాత నీరజ్‌‌ తన కారులో ఆమెను మౌజ్‌‌పూర్‌‌ వద్ద దించి రాత్రి 9 గంటల సమయంలో మెట్రో స్టేషన్‌‌ వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏడేళ్ల వయసులో పోలియో బారిన పడిన నీరజ్, మొదట వీల్‌‌చైర్ టెన్నిస్ ఆడి ఆ తర్వాత పారా అథ్లెటిక్స్‌‌లోకి ప్రవేశించాడు. ఎఫ్‌‌----55 విభాగంలో ప్రతిభ కనబరిచాడు. డోపింగ్‌‌ పరీక్షలో  నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో నాలుగేళ్ల సస్పెన్షన్‌‌ పడింది. ఈ ఉదంతం తర్వాత నీరజ్ తీవ్ర నిరాశలో ఉన్నట్లు ఇండియా పారా అథ్లెటిక్స్ హెడ్ కోచ్ సత్యనారాయణ తెలిపారు.