సిరిసిల్ల జిల్లా: రైతులకు అండగా సర్కారు..చెక్కపెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

సిరిసిల్ల జిల్లా: రైతులకు అండగా సర్కారు..చెక్కపెల్లిలో ధాన్యం కొనుగోలు  కేంద్రం ప్రారంభం
  •    ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ/ వేములవాడరూరల్​, వెలుగు : రైతుల పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి, మధ్యవర్తుల దోపిడీ నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ అన్నదాతలు అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్​ మండలం చెక్కపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్​కు రూ.500 బోనస్ అందిస్తూ రైతులకు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తోందని తెలిపారు. తెలంగాణ నేల స్వభావానికి అనుకూలమైన ఏడు రకాల సన్న వడ్లను సాగు చేయాలని ప్రభుత్వం రైతులకు సూచించిందని చెప్పారు. దీనివల్ల బహిరంగ మార్కెట్లోనూ మంచి ధర లభించే అవకాశం ఉంటుందన్నారు. 

నకిలీ విత్తనాలను అరికట్టడంతో పాటు నాణ్యమైన విత్తనాలు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బహిరంగ మార్కెట్​లో మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తే రైతులు అక్కడ విక్రయించుకోవచ్చని, ఆశించిన ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. 

అటవీ ప్రాంతంలో బైక్ పై పర్యటన 

దట్టమైన అడవుల్లో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి,  వన్యప్రాణులకు, ప్రజలకు నీటి భరోసా కల్పిస్తామని ఆది శ్రీనివాస్​అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల, రుద్రంగి మండలం మానాల, రుద్రంగి అటవీ ప్రాంతంలో ఆయన బైక్​ పై పర్యటించారు. ఆయనతో పాటు డీఎఫ్ఓ సత్యనారాయణ, ఎఫ్ఆర్ఓ మాధవి సీతల్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. 

ఎల్​ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అడవుల్లోని సహజ నీటి వనరుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. మరిమడ్ల అడవిలోని జాలవాగు, కొండ చెరువు తదితర ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసేలా చెక్​డ్యామ్​లు, చిన్న చెరువులు, కుంటలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

బుగ్గ రాజేశ్వర స్వామి సమీపంలోని చెక్​డ్యామ్​ ద్వారా నీటిని నిల్వ చేయడం వల్ల సమీప గిరిజన తండాలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడతామని తెలిపారు. భవిష్యత్​లో ఎండలు, నీటి కొరత తీవ్రత పెరిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సహజ నీటి వనరులను సంరక్షించుకోవడం అత్యంత అవసరమన్నారు. తొలి విడతలో గుర్తించిన ప్రాంతాలతో పాటు, రైతులు కోరిన ఇతర అటవీ ప్రాంతాలను కూడా పరిశీలించి అవసరమైన పనులపై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.