ఊరు మొత్తాన్ని ముంపుగా ప్రకటించండి..రిజర్వాయర్ సర్వేను అడ్డుకున్న నారాయణపూర్ గ్రామస్తులు

ఊరు మొత్తాన్ని ముంపుగా ప్రకటించండి..రిజర్వాయర్ సర్వేను అడ్డుకున్న నారాయణపూర్ గ్రామస్తులు
  • మందు డబ్బాతో వార్డు మెంబర్​ భర్త ఆత్మహత్యాయత్నం
  • సర్వే చేయకుండానే వెనుదిరిగిన ఆర్డీవో, అధికారులు

గంగాధర, వెలుగు : కరీంనగర్​జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రిజర్వాయర్ సర్వేకు వచ్చిన అధికారులను ఊరు శివారులో బుధవారం అడ్డుకున్నారు. ఉపాధి హామీ పనుల కోసమని డప్పు చాటింపు చేసి, ఆర్డీవో షర్మిల, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బండి రాజేశ్వరి, ఇరిగేషన్​ డివిజినల్ ఇంజినీర్ హరికుమార్, ఈఈ బాలకిషన్​, డీపీవో జగదీశ్వర్​, తహశీల్దార్​ అంబటి రజిత తీసుకువచ్చారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామం మొత్తాన్ని ముంపుగా ప్రకటించిన తర్వాతే సర్వే చేపట్టాలని తేల్చిచెప్పారు. సర్పంచ్​ భర్త తమను వేధిస్తున్నాడని వార్డు మెంబర్​ భర్త మహేశ్​, స్థానికుడు గుర్రం రాము అధికారుల ముందే పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, గ్రామస్తులు వారిని కరీంనగర్​ సివిల్​ హాస్పిటల్​కు తరలించారు.

 గ్రామస్తుల తీవ్ర నిరసనల నడుమ చేసేది ఏమీ లేక అధికారులు ఊరు శివారులోనే మైక్ ఏర్పాటుచేసి, నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తైతే కలిగే ప్రయోజనాలను వివరించారు. తాము కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చామని, సర్వేను అడ్డుకోవద్దని కోరినా గ్రామస్తులు మొండికేయడంతో అధికారులు సర్వే చేయకుండానే వెనుదిరిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.