హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగరంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే సదర్ సమ్మేళన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనను కలిసిన ప్రతినిధి బృందం.. వచ్చే నెల 4న ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరగనున్న సదర్ వేడుకల ఆహ్వాన పత్రికను అందజేసింది.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలను తమ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కమిటీ నేతలు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, యాదాద్రి ఆలయ పాలక మండలి సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్‌లతో పాటు పలువురు యాదవ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న సదర్ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లగా, ఉత్సవాలను విజయవంతం చేయాలని సీఎం సూచించారు.
