మా ఫొటోలను మార్ఫింగ్‌ చేసి తప్పుడు ప్రచారం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ భార్య ఇందుజా

మా ఫొటోలను మార్ఫింగ్‌ చేసి తప్పుడు ప్రచారం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ భార్య ఇందుజా
  • కేటీఆర్, బీఆర్ఎస్​సోషల్​మీడియా ఖాతాలపై సీపీ సజ్జనార్‌‌కు ఫిర్యాదు
  • కులం, రాజకీయ నేపథ్యాన్ని లక్ష్యంగా చేసుకుని పరువుప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నరు
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌, వెలుగు: బీఆర్ఎస్ ​వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగంపై కఠిన చర్యలు తీసుకోవాలని విప్​ బల్మూరి వెంకట్​భార్య, కాంగ్రెస్‌ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బల్మూరి ఇందుజా బుధవారం హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌‌కు ఫిర్యాదు చేశారు. తన భర్తతో ఉన్న ఫొటోలను మార్ఫింగ్​చేసి తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్​ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.  

తన భర్త, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో తాను కలిసి ఉన్న ఫొటోలను పెట్టి, ఆయన వేరే మహిళతో ఉన్నట్టుగా బీఆర్ఎస్​ సోషల్​ మీడియాలో  దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తమ వైవాహిక జీవితం, వ్యక్తిగత విషయాలను వివాదాల్లోకి లాగుతున్నారని , దీని వల్ల  తమ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ

తాను షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వ్యక్తినని, తన కులం, రాజకీయ నేపథ్యాన్ని అవమానించే ప్రయత్నం జరుగుతోందని ఇందుజా అన్నారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయంగా, వ్యక్తిగతంగా తమను అప్రతిష్టపాలు చేసే ఉద్దేశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రచారం వెనుక ఉన్నవారితో పాటు ప్రచారానికి సహకరిస్తున్న వ్యక్తుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ వ్యవహారానికి సంబంధించిన డిజిటల్‌ ఆధారాలను భద్రపరచాలని, కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే, ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద వర్తించే నిబంధనలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇందుజా ఫిర్యాదును స్వీకరించిన సీపీ సజ్జనార్‌‌.. కేసు దర్యాప్తు కోసం సిటీ సైబర్ క్రైమ్‌ డీసీపీకి బదిలీ చేశారు. సోషల్‌మీడియాలో ప్రచారం జరిగిన ఫొటోలు, కంటెంట్‌ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు