బతుకుడా.. సచ్చుడా? రైస్ మిల్లులు, ఫ్లైవుడ్ కంపెనీల కాలుష్యంతో రోగాలు

బతుకుడా.. సచ్చుడా? రైస్ మిల్లులు, ఫ్లైవుడ్ కంపెనీల కాలుష్యంతో రోగాలు
  • ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో గ్రామస్తుల ధర్నా
  •  ఇండ్ల నుంచి కాలు బయట పెట్టలేకపోతున్నమని ఆవేదన  

ఇబ్రహీంపట్నం, వెలుగు :  రైస్​ మిల్లులు, ఫ్లైవుడ్​ కంపెనీల దుమ్ము, ధూళితో రోగాలొస్తున్నాయని వెంటనే తొలగించాలని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం మెయిన్​రోడ్డుపై  గ్రామస్తులు బైఠాయించారు. చుట్టుపక్కల ఉన్న ఆరు రైస్​మిల్లులు, ఫ్లైవుడ్​ కంపెనీలను బంద్​ చేయించాలని డిమాండ్​చేశారు. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ఊపిరితిత్తులు, కంటి సంబంధ వ్యాధులు వస్తున్నాయన్నారు. 

ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేకపోతున్నామన్నారు. అధికారులకు చెప్పినా స్పందించకపోవడంతో ధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు. ఇండ్లల్లో నల్లగా దుమ్ము పేరుకుపోతోందని, డోర్లు, కిటికీలు తెరిచేపరిస్థితి లేదన్నారు. కాగా, ఓ ఆందోళనకారుడు పెట్రోల్​పోసుకోబోగా పోలీసులు బాటిల్‌‌ లాక్కున్నారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్​సునీత ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పోచారం సర్పంచ్​ వెంకటేష్​, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.