- గతంలో నోటీసులివ్వగానే ముందస్తు బెయిల్ తెచ్చుకున్న మిల్లర్లు
- కేసులు పెట్టినా అరెస్ట్ చేయలేని పరిస్థితి
- హైదరాబాద్ లోనే ఫిర్యాదు చేసి, స్పెషల్ బృందాలను పంపుతున్న ప్రభుత్వం
కరీంనగర్, వెలుగు: ధాన్యం అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లర్ల ఆట కట్టించేందుకు ప్రభుత్వం రూట్ మార్చింది. గతంలో సీఎంఆర్, టెండర్ ధాన్యం బకాయిలపై సివిల్ సప్లై డీఎంలు నోటీసులు ఇవ్వగానే, లేదంటే సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయగానే డీఫాల్టర్లు కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకొని యథేచ్ఛగా తిరుగుతున్నారు. కేసులు నమోదు చేశాక స్థానిక పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడంతోపాటు వారు బెయిల్ తెచ్చుకునేవరకు అరెస్టు చేయకుండా వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని పసిగట్టిన ప్రభుత్వం ఈసారి అత్యంత పకడ్బందీగా సీఐడీ అస్త్రాన్ని ప్రయోగించినట్లు తెలిసింది. ప్రభుత్వ వ్యూహాత్మక చర్యలతో రాష్ట్రంలోని అక్రమ మిల్లర్ల గుండెల్లో వణుకు మొదలైంది.
16 మందిపై కేసులైనా ఒక్కరిని అరెస్టు చేయలే
ప్రభుత్వం సీఎంఆర్ కోసం అప్పగించిన ధాన్యం రైస్ మిల్లుల్లో ఉందా ? లేదా ? అనే విషయాన్ని పరిశీలించేందుకు సివిల్ సప్లైకి చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం దాడులు నిర్వహిస్తుండేది. ఈ విభాగం అడపాదడపా దాడులు చేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు రిపోర్టు ఇస్తుంటుంది. అయితే ఇది ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ టాస్క్ ఫోర్స్(ఈటీఎఫ్) ను ప్రభుత్వం రంగంలోకి దింపింది. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్, శంకరపట్నం, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో రూ.45.74 కోట్ల ధాన్యం పక్కదారి పట్టించిన 16 మంది మిల్లర్లపై ఈ నెల రెండో వారంలో స్థానిక పీఎస్‌లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ఏ ఒక్కరిని పోలీసులు అరెస్టు చేయలేదు. వీరిలో ఇప్పటికే చాలా మంది ముందస్తు బెయిల్ పై ఉన్నట్లు తెలిసింది. గత నెల రోజుల్లో ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే నాలుగు రోజుల కిందట అరెస్టయిన నలుగురు మిల్లర్లు ప్రభుత్వానికి సీఎంఆర్ బకాయి లేకుండ బియ్యం అప్పగించినవారేనని, బకాయి ఉన్న డీఫాల్టర్లు బెయిళ్లపై బయటతిరుగుతుంటే.. బకాయిలు లేని మిల్లర్లు జైలుపాలయ్యారని మిల్లర్స్ అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిల్లర్ల కేసులు సీఐడీకి..
పోలీస్ కేసులు నమోదు చేసినా మిల్లర్లు తప్పించుకుంటుడడంతోనే ప్రభుత్వం సీఐడీకి దొడ్డు బియ్యం కేసును అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి కేసుల్లో సాధారణంగా ఫిర్యాదుదారుగా ఆయా జిల్లాల సివిల్ సప్లై డీఎం ఉండేవారు. కానీ ఈ సారి సన్నబియ్యానికి బదులు దొడ్డు బియ్యం అప్పగించిన మిల్లర్లపై సివిల్ సప్లై కార్పొరేషన్(ప్రొక్యూర్ మెంట్) జనరల్ మేనేజర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. వారిని అదుపులోకి తీసుకునే వరకు కేసు విషయంగానీ, దాడుల విషయంగానీ ఏ మాత్రం బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో డీఫాల్టర్ల పై కేసులు, ఆస్తుల రికవరీ విషయంలోనూ ఇలాంటి వ్యూహమే అనుసరించనున్నట్లు తెలిసింది.
ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసిన మిల్లర్లు
గత ఆదివారం జమ్మికుంటలో అన్నపూర్ణ ట్రేడర్స్యజమాని కొల్లాల మల్లికార్జున్, లక్ష్మీసాయి ఇండస్ట్రీస్యజమాని యాంసాని సంపత్, కారుణ్య ట్రేడర్స్యజమాని లెంకలపల్లి మధును సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం మళ్లీ జమ్మికుంటకు రావడంతో మిల్లర్లు భయాందోళనకు గురయ్యారు. ఎవరిని అదుపులోకి తీసుకుంటారోనన్న భయంతో ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పలువురు మిల్లర్లు పరారయ్యారు. అంతేగాక రైస్ మిల్లులకు కూడా తాళాలు వేశారు. ఇటీవల అరెస్టయిన మిల్లర్ల వ్యాపార భాగస్వాముల కోసం సీఐడీ అధికారులు వచ్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో జమ్మికుంటకు చెందిన మరికొందరు మిల్లర్లు జైలుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.
