- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆగమవ్వడానికి కేసీఆర్ అసమర్థ డిజైన్లే కారణమని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల వినియోగంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలన్నీ పచ్చి అబద్ధాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సచివాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశం సాక్షిగా కొందరు ప్రతిపక్ష నేతలు నిరాధారమైన వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రస్తుత సీజన్లో కృష్ణా నది నుంచి ఏపీ కంటే తెలంగాణే ఎక్కువ నీటిని వాడుకుందని చెప్పారు. బ్యారేజీల విధ్వంసానికి కారకులైన బీఆర్ఎస్ నేతలే.. ఇప్పుడు సిగ్గులేకుండా ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సీజన్లో సాగు, తాగునీరు, విద్యుదుత్పత్తి శ్రీశైలం రిజర్వాయర్ లో తెలంగాణ వినియోగం 127.57 టీఎంసీలైతే ఏపీ వినియోగం 72.237 టీఎంసీలన్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో తెలంగాణ వినియోగం 41.908 టీఎంసీలు కాగా.. ఏపీ వాడింది 17.207 టీఎంసీలని పేర్కొన్నారు.
నిబంధనలను కాదని గేట్లు ఎట్ల దించుతం?
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులపై మంత్రి స్పష్టతనిచ్చారు. ‘కేంద్ర జలశక్తి శాఖ నియమించిన టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ మార్గదర్శకాల ప్రకారమే ప్రస్తుతం మరమ్మతు, పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మరమ్మతులు పూర్తయ్యేవరకు బ్యారేజీల గేట్లను కిందకు దించేందుకు ఎన్డీఎస్ఏ ససేమిరా ఒప్పుకోవడం లేదు. నిబంధనల ప్రకారం గేట్లు దించకుండా రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయడం గానీ, పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోయడం గానీ సాంకేతికంగా అసాధ్యం అని తేల్చిచెప్పారు.
నీటి కష్టాలకు బీఆర్ఎస్సే కారణం
బీఆర్ఎస్ హయాంలో వేసిన లోపభూయిష్టమైన డిజైన్లు, అవినీతి, నాసిరకం నిర్మాణాల ఫలితంగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని తెలంగాణ ప్రజలందరికీ తెలుసని మంత్రి ఉత్తమ్ అన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం వినియోగానికి ఏమాత్రం పనికిరావని ఎన్డీఎస్ఏ స్పష్టంగా తేల్చిచెప్పిందన్నారు
రాష్ట్రాన్ని ఈ స్థితికి తెచ్చినందువల్లే తెలంగాణలో ఎల్ నినో (తీవ్ర వర్షాభావ) ప్రభావం మరింత తీవ్రమైందని, ఈ కష్టాలన్నింటికీ బీఆర్ఎస్సే కారణమని మండిపడ్డారు. ప్రాజెక్టులను నాశనం చేసి రాష్ట్రాన్ని దగా చేసిన గులాబీ నేతలే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం విడ్డూరంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
