దాన కిశోర్ రీఅపాయింట్మెంట్..గవర్నర్ స్పెషల్ సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్

దాన కిశోర్ రీఅపాయింట్మెంట్..గవర్నర్ స్పెషల్ సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్
  • ఈ నెలాఖరున పదవీ విరమణ.. ఆ వెంటనే కొత్త బాధ్యతలు
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి  దానకిశోర్‌‌కు ప్రభుత్వం మరో కీలక బాధ్యతను అప్పగించింది. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ఆయన్ను.. రిటైర్మెంట్ పూర్తయిన వెంటనే గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా  రీఅపాయింట్‌‌మెంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్​ సంజయ్ జాజు ఉత్తర్వులు ఇచ్చారు. 1996 బ్యాచ్‌‌కు చెందిన దాన కిశోర్  విశేష అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని గవర్నర్‌‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

తెలంగాణ క్యాడర్‌‌లో సుదీర్ఘకాలం పనిచేసిన దాన కిశోర్ గతంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, జీహెచ్ఎంసీ, జలమండలి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వంటి పలు కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలులో, పరిపాలనా సంస్కరణల్లో ఆయన అందించిన సేవలను గుర్తించిన ప్రభుత్వం.. పదవీ విరమణ తర్వాత కూడా ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావించి ఈ నియామకం చేపట్టింది. లోక్​భవన్ యంత్రాంగానికి, ప్రభుత్వానికి మధ్య పాలనాపరమైన సమన్వయాన్ని వేగవంతం చేయడంలో దాన కిశోర్ అనుభవం ఎంతగానో దోహదపడుతుందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.