ఇండియా క్లీన్‌ ‌స్వీప్‌‌..జింబాబ్వే పై 3-0తో వన్డే సిరీస్‌‌ సొంతం

ఇండియా క్లీన్‌ ‌స్వీప్‌‌..జింబాబ్వే పై 3-0తో వన్డే సిరీస్‌‌ సొంతం
  •     మూడో వన్డేలోనూ 8 వికెట్ల తేడాతో విజయం
  •     ప్రతీక, షెఫాలీ హాఫ్‌‌ సెంచరీలు
  •     వైష్ణవికి ఐదు వికెట్లు 

వడోదర: జింబాబ్వే విమెన్స్‌‌తో జరిగిన తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌‌ను ఇండియా విమెన్స్‌‌ జట్టు క్లీన్‌‌స్వీప్‌‌ చేసింది. బౌలింగ్‌‌లో వైష్ణవి శర్మ (5/39), బ్యాటింగ్‌‌లో ప్రతీక రావల్‌‌ (56 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 59 నాటౌట్‌‌), షెఫాలీ వర్మ (26 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 51 నాటౌట్‌‌) చెలరేగడంతో.. బుధవారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలోనూ టీమిండియా 8 వికెట్ల తేడాతో జింబాబ్వేపై నెగ్గింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 3–0తో వైట్‌‌వాష్‌‌ చేసింది. టాస్‌‌ నెగ్గిన జింబాబ్వే 39.5 ఓవర్లలో 131 రన్స్‌‌కు ఆలౌటైంది. మోడెస్టర్ ముపాచిక్వా (37), జోసెఫిన్ ఎన్కోమో (35), చీడ్జా ధురురు (20), న్యాషా గ్వాంజురా (10) మోస్తరుగా ఆడారు. స్టార్టింగ్‌‌ నుంచి ఇండియా బౌలర్లు వైష్ణవితో పాటు క్రాంతి గౌడ్‌‌ (2/23), సయాలీ (2/11) కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేశారు. దాంతో రెండో ఓవర్‌‌లో మొదలైన వికెట్ల పతనం చివరివరకు కొనసాగింది. ఇన్నింగ్స్‌‌లో ఏడుగురు సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితం కావడంతో జింబాబ్వే భారీ స్కోరు చేయలేకపోయింది. వైష్ణవికి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’, ప్రతీకాకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌’ అవార్డులు లభించాయి. 

తొలి బాల్‌‌కే వికెట్‌‌..

చిన్న ఛేదనలో ఇండియా 17 ఓవర్లలో 133/2 స్కోరు చేసి నెగ్గింది. ఇన్నింగ్స్‌‌ తొలి బాల్‌‌కే యాస్తికా భాటియా (0)ను సిబండా (1/18) డకౌట్‌‌ చేసింది. 0/1 స్కోరు వద్ద నుంచి ప్రతీక, హర్లీన్‌‌ డియోల్‌‌ (19) నెమ్మదిగా ఆడి ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టారు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌‌తో స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేశారు. ఈ క్రమంలో రెండో వికెట్‌‌కు 59 రన్స్‌‌ జోడించి 9వ ఓవర్‌‌లో హర్లీన్‌‌.. లోరిన్‌‌ పిరి (1/28)కు వికెట్‌‌ ఇచ్చింది. ఈ టైమ్‌‌లో వచ్చిన షెఫాలీ భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. రెండో ఎండ్‌‌లో ప్రతీకా కూడా భారీ షాట్లకు తెరలేపడంతో స్కోరు బోర్డు వేగంగా ముందుకెళ్లింది. ప్రతీక 47, షెఫాలీ 26 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీలు పూర్తి చేశారు. మూడో వికెట్‌‌కు 74 రన్స్‌‌ జోడించి మరో 198 బాల్స్‌‌ మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు. 

సంక్షిప్త స్కోర్లు
జింబాబ్వే: 39.5 ఓవర్లలో 131 ఆలౌట్‌‌ (ముపాచిక్వా 37, ఎన్కోమో 35, వైష్ణవి 5/39). ఇండియా: 17 ఓవర్లలో 133/2 (ప్రతీక 59*, షెఫాలీ 51*, సిబండా 1/18).