తుమ్మిడిహెట్టే ఆధారం మళ్లీ తెరపైకి కాకా కలల ప్రాజెక్టు

తుమ్మిడిహెట్టే ఆధారం  మళ్లీ తెరపైకి కాకా కలల ప్రాజెక్టు
  • రీడిజైన్ పేరుతో అప్పట్లో పక్కనపెట్టిన కేసీఆర్
  • తుమ్మిడి హెట్టితో ముంపు తక్కువేనని తేల్చిన సీడబ్ల్యూపీఆర్ఎస్ స్టడీ
  • ముంబైలో ఫడ్నవీస్‌‌తో సీఎం రేవంత్, ఉత్తమ్ భేటీ
  • ముంపు లేకుంటే ఎత్తుపై పునరాలోచిస్తామన్న ‘మహా’ సీఎం
  • జాయింట్ కమిటీ స్టడీ తర్వాతే తుది నిర్ణయం

 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సాగునీటి రంగ చరిత్రలో ఎన్నో మలుపులు తిరిగి మళ్లీ మొదటికే వచ్చిన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు మాత్రమే. ఉత్తర తెలంగాణతో పాటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు మొదలైన ఈ ప్రాజెక్టు రాజకీయ, అంతర్రాష్ట్ర వివాదాలతో ఆగిపోయినా, తన ప్రాధాన్యాన్ని చాటుతూనే ఉంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై తాజాగా మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం బృందం జరిపిన చర్చలతో ఈ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకి వచ్చింది. కాళేశ్వరం కుంగుబాటు, రిపేర్లు చేసినా గ్యారంటీ లేదన్న నిపుణుల హెచ్చరికలు, ఒకవేళ ఎత్తిపోసినా తడిసిమోపెడయ్యే కరెంట్ ఖర్చుల నేపథ్యంలో తెలంగాణ సాగునీటి అవసరాలకు ఇక తుమ్మిడిహెట్టే ఆధారమనే అభిప్రాయం బలపడుతోంది.

కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి జీవితకాల కలగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి వద్ద పురుడుపోసుకుంది. ప్రాణహిత నీళ్లు తెలంగాణకు దక్కాలని అత్యంత బలంగా నినదించిన తొలి నాయకుడు కాకాయే. గోదావరికి అతిపెద్ద ఉపనది అయిన ప్రాణహిత ద్వారా వర్షాకాలంలో ఏటా వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుండేది. ఆ నీటిని గ్రావిటీ ద్వారా తెలంగాణలోని ఎగువ మెట్ట ప్రాంతాలకు మళ్లించాలని ఆయన ఉద్యమించారు. ఉమ్మడి ఏపీలో సొంత పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలపైనే ఒత్తిడి తెచ్చారు. ప్రాజెక్టు మంజూరు చేయకపోతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తప్పదని అధిష్ఠానాన్ని హెచ్చరించి మరీ ఒప్పించారు. 2004లోనే నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో మాట్లాడి ప్రాజెక్టును పట్టాలెక్కించడంలో కాకా వెంకటస్వామి కీలక పాత్ర పోషించారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక రీడిజైన్ పేరుతో కేసీఆర్ ఆ కలలను కల్లలు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు ఆపన్నహస్తంగా మారబోతోంది.

జలయజ్ఞంలో కీలకం

2004లో వైఎస్ ప్రారంభించిన జలయజ్ఞంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కీలకంగా మారింది. సమగ్ర సర్వేల అనంతరం 2007 మేలో జీవో 124ను, 2008 నవంబర్‌లో పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీవో 272ను జారీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతిగా నామకరణం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని దాదాపు 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలకు 10 టీఎంసీలు, గ్రామాల తాగునీటికి మరో 10 టీఎంసీలు, పరిశ్రమలకు 16 టీఎంసీలు కలిపి మొత్తం 160 టీఎంసీల నీటిని మళ్లించాలని నిర్ణయించారు. 2008 నవంబర్‌లో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌కు, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద కాల్వల పనులకు వైఎస్ శంకుస్థాపన చేశారు.

నిధులు పుష్కలం

తొలుత ప్రాజెక్టును రూ.17,875 కోట్లతో నిర్మించాలనుకోగా, డీపీఆర్ సిద్ధమయ్యే నాటికి అంచనా రూ.38,500 కోట్లకు చేరింది. ప్రాజెక్టును 28 ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రధాన బ్యారేజీకి మహారాష్ట్ర నుంచి అడ్డంకులు తొలగకముందే కాల్వలు, సొరంగాలు, లిఫ్ట్ పంప్‌హౌస్‌ల పనులు మొదలుపెట్టారు. ప్రాజెక్టుకు 80 వేల ఎకరాలకు పైగా భూమి అవసరం కాగా, సుమారు 40 వేల ఎకరాల భూసేకరణ పూర్తి చేశారు. 2008 నుంచి 2014 మధ్య దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారు.

మహారాష్ట్ర ససేమిరా

పనులు వేగంగా సాగుతున్న సమయంలోనే మహారాష్ట్ర అడ్డుపుల్ల వేసింది. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి ససేమిరా అన్నది. ఆ ఎత్తుతో కడితే గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాల్లో సుమారు 3,782 ఎకరాలు ముంపునకు గురవుతాయని అభ్యంతరం చెప్పింది. 148 మీటర్లకే పరిమితం చేయాలని, ఆ ఎత్తులో ముంపు 100 ఎకరాల లోపే ఉంటుందని పట్టుబట్టింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు.

తెలంగాణ వచ్చినా అంతే

2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించాక, 2015లో అప్పటి సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో తొలిసారి చర్చలు జరిపారు. అప్పుడు కూడా మహారాష్ట్ర పాత స్టాండ్‌కే కట్టుబడి 152 మీటర్లకు ఒప్పుకోబోమని చెప్పింది. 2016లో మళ్లీ సమావేశమైనా ఫలితం లేకపోగా, అదే ఏడాది ఆగస్టులో 148 మీటర్లకు ఒప్పందం చేసుకున్నారు. కానీ కేసీఆర్ ప్రాణహితను పక్కనపెట్టి రీ ఇంజినీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించి, రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్‌మానేరు, మల్లన్నసాగర్‌కు నీటిని తరలించాలని ప్లాన్ చేశారు.

రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేశారు. దీనిని ప్రారంభించిన నాలుగేళ్లకే, 2023 అక్టోబర్‌లో, ప్రాజెక్టుకు గుండెకాయ అని చెప్పిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ సీపేజీలు బయటపడ్డాయి. దర్యాప్తు జరిపిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) నిపుణుల కమిటీ ప్లానింగ్, డిజైనింగ్, నాణ్యతా ప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణలో ఘోర వైఫల్యాలు ఉన్నాయని తేల్చింది. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమనటంతో రూ.లక్ష కోట్ల ప్రాజెక్టు నుంచి చుక్క నీరు ఎత్తిపోయలేని పరిస్థితి దాపురించింది. రిపేర్లు చేసినా ఒరిగేదేమీ లేదని, ఎక్కువ నీళ్లు ఎత్తిపోయలేమని, ఎత్తిపోస్తే కరెంట్ బిల్లులు తడిసిమోపెడవుతాయని నిపుణులు తేల్చిచెబుతున్నారు. కాళేశ్వరం గుదిబండలా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

మళ్లీ తుమ్మిడిహెట్టిపైనే ఆశలు

కాళేశ్వరం నిరుపయోగంగా మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కాకా కలల ప్రాజెక్టు తుమ్మిడిహెట్టిని మళ్లీ తెరపైకి తెచ్చింది. గతంలోని లోపాలను సరిదిద్దుతూ తుమ్మిడిహెట్టి వద్ద రెండు బ్యారేజీలు నిర్మించేలా పటిష్ఠంగా కొత్త డిజైన్ రూపొందించింది. ఆర్వీ అసోసియేట్స్, పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) క్షేత్రస్థాయిలో అధ్యయనాలు చేసి ముంపు తక్కువేనని తేల్చాయి.

ఆ రిపోర్టుల ఆధారంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి లేఖలు రాసి, మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు. దీంతో సెప్టెంబర్‌లో తొలిసారిగా రెండు రాష్ట్రాలతో సెంట్రల్ వాటర్ కమిషన్ సమావేశం నిర్వహించింది. ఈ నెల 26న ముంబైలో సీఎంల స్థాయి సమావేశం జరిగింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులు భేటీ అయ్యారు. తాజా రిపోర్టులన్నీ సమర్పించి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ రాష్ట్రంలో ముంపు లేకుంటే, ప్రజలకు నష్టం జరగకుంటే ఎత్తుపై పునరాలోచిస్తామని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. జాయింట్ కమిటీ వేసి మళ్లీ అధ్యయనం చేయించి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. దీంతో ప్రాజెక్టు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగు వేసినట్లయింది. కాకా కలల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది.