- 11 ఏళ్లుగా పోరాడుతున్న జ్యోతి కేసులో తీర్పు
- పెండ్లయిందని ఉద్యోగం నిరాకరించిన టీజీఎస్పీడీసీఎల్
- అన్ని బెనిఫిట్స్‌తో నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశం
- సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన జస్టిస్ వేణుగోపాల్
హైదరాబాద్, వెలుగు: కారుణ్య నియామకాల్లో వివాహిత కుమార్తెలకు అర్హత లేదనడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. కుమారుడు, కుమార్తె మధ్య లింగ ప్రాతిపదికన వివక్ష చూపడం సరికాదని పేర్కొంది. విడాకులు పొందిన లేదా భర్త వదిలేసిన మహిళలకు మాత్రమే కారుణ్య నియామకాన్ని పరిమితం చేయలేమని సుప్రీంకోర్టు సయారా ఖాతూన్ కేసులో ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో తండ్రి మరణించినప్పటి నుంచి 11 ఏండ్లుగా కారుణ్య కొలువు కోసం పోరాడుతున్న కె. జ్యోతికి తగిన నియామక ఉత్తర్వులు జారీ చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)ను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఇటీవల తీర్పు వెలువరించారు. టీజీఎస్పీడీసీఎల్‌లో అసిస్టెంట్ లైన్‌మన్‌గా పనిచేసిన కె. రామకృష్ణారెడ్డి 2014లో మరణించగా, అదే ఏడాది ఆయన కూతురు జ్యోతి కారుణ్య నియామకం కోసం అప్లై చేసుకున్నారు.
అయితే ఆమె వివాహిత అనే కారణంతో అధికారులు అభ్యర్థనను తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. తండ్రి మరణించిన సమయంలో కుటుంబ వారసులుగా తల్లి, కుమారుడు, జ్యోతి ఉన్నారని, కుమారుడు లండన్‌లో ఉంటూ ఇక్కడ ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో జ్యోతి దరఖాస్తు చేసుకున్నారని కోర్టు గుర్తించింది. ఆమెకు పెండ్లయిందన్న కారణంతోనే ఉద్యోగం నిరాకరించడం సమంజసం కాదని పేర్కొంది. సుదీర్ఘకాలంగా చేసిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోకుండా తిరస్కరించడం సరికాదని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జ్యోతికి వర్తించే అన్ని ప్రయోజనాలతో కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేయాలని సంస్థను ఆదేశించింది.
