తెలంగాణ మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

తెలంగాణ మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  •  కరువు పరిస్థితుల అధ్యయనం కోసం నవంబర్‌‌‌‌ 3, 4 తేదీల్లో జిల్లాల పర్యటన
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎల్‌‌‌‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, కొన్ని మండలాలకే పరిమితం చేయకుండా తెలంగాణ మొత్తాన్ని కరువు ప్రభావిత రాష్ట్రంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌‌‌‌ చేశారు. కరువు పరిస్థితులను ఆసరాగా చేసుకుని వ్యాపారులు నిత్యావసరాలను బ్లాక్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

గోదాముల్లో సరుకులు దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తే.. సీపీఐ ఆధ్వర్యంలో కరువు దాడులు చేసి ఆ సరుకులను పేదలకు పంచుతామని తెలిపారు. ఈ మేరకు బుధవారం మఖ్దూం భవన్‌‌‌‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్‌‌‌‌ బోస్‌‌‌‌, ఎం. బాలనర్సింహతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సగానికిపైగా మండలాల్లో తీవ్ర కరువు ఉందని, ప్రభుత్వం వెంటనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపి నిధులు రాబట్టాలని కోరారు.   

అసంఘటిత రంగ కార్మికులకు రూ.15వేల భృతి ఇవ్వాలి

ఉపాధి కోల్పోయిన పట్టణ అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.15 వేల కరువు భృతి ఇవ్వాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్‌‌‌‌ చేశారు. తాగునీటి ట్యాంకర్ల దోపిడీని, బియ్యం ధరల పెంపును అరికట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు నవంబర్‌‌‌‌ 3, 4 తేదీల్లో సీపీఐ బృందాలు జిల్లాల్లో పర్యటిస్తాయని పేర్కొన్నారు. నవంబర్‌‌‌‌ 10న అన్ని జిల్లా కేంద్రాల్లో కరువు సహాయక చర్యల కోసం ధర్నాలు నిర్వహిస్తామని వివరించారు. జీవో 58, 59 కింద పేదల ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.