హైదరాబాద్, వెలుగు: బియ్యం కృత్రిమ కొరత సృష్టించినా, ఇష్టారాజ్యంగా రేట్లు పెంచినా కఠిన చర్యలు తప్పవని రైస్ మిల్లర్లు, వ్యాపారులను ప్రభుత్వం హెచ్చరించింది. అవసరమైతే ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం విక్రయాలు చేపడ్తామని సివిల్ సప్లయ్ శాఖ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ స్పష్టం చేశారు. బుధవారం సివిల్ సప్లయ్స్ శాఖ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని సివిల్ సప్లయ్ భవన్‌లో శాఖ డైరెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
మిర్యాలగూడ, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాలకు చెందిన ప్రముఖ రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు ఇందులో పాల్గొన్నారు. మార్కెట్‌లో బియ్యం కొరత లేకుండా చూడాలని, ధరలను నియంత్రణలో ఉంచాలని డైరెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బియ్యం నిల్వలు గత సీజన్‌కు చెందినవేనని, ఈ నేపథ్యంలో ధరలను అనవసరంగా పెంచడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వ్యాపారుల లాభాపేక్ష కారణంగా సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడకూడదని పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ.. బియ్యం ధరలు అదుపులో ఉండేలా చర్యలు
తీసుకుంటామని డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ స్పష్టం చేశారు.
