మార్కెట్లో జియో జోరు.. లిస్టింగ్ రోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా రికార్డ్

మార్కెట్లో జియో జోరు.. లిస్టింగ్ రోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా రికార్డ్
  •  రూ.13 లక్షల కోట్లకు చేరిన మార్కెట్ క్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •  27 శాతం లాభంతో మొదటి రోజు ముగింపు
  •  గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆరు, ఆసియాలో రెండో  అతిపెద్ద టెల్కోగా అవతరణ 

ముంబై:  టెలికం కంపెనీ రిలయన్స్ జియో  లిస్టింగ్ రోజు రికార్డుల మోత మోగించింది.  ‘ఎప్పుడొచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా ?’ అన్నట్టు మొదటి రోజే ఇండియాలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టింది.  జియో మార్కెట్ క్యాప్ రూ. 13 లక్షల కోట్లకు పెరగగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.15.67 లక్షల కోట్లతో మొదటి ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది. 

ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ వాల్యూ రూ.11.88 లక్షల కోట్లుగా ఉంది.  గ్లోబల్ మార్కెట్లో కూడా జియో తన సత్తా చాటింది. ఆరో అత్యంత విలువైన టెలికం దిగ్గజంగా చరిత్ర సృష్టించగా, ఆసియాలో  చైనా మొబైల్ తర్వాత రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  నిలిచింది.  కంపెనీ షేర్లు ఇష్యూ ధర రూ.1,119తో పోలిస్తే   రూ.1,358 వద్ద 22 శాతం  ప్రీమియంతో బుధవారం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిస్ట్ అయ్యాయి. చివరికి 27 శాతం లాభంతో  రూ.1,419 వద్ద ముగిశాయి.   

రిటైల్ ఇన్వెస్టర్లకు పండుగ

జియో లిస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  రిటైల్ ఇన్వెస్టర్లకు  మంచి లాభాలొచ్చాయి.  కంపెనీ  తన  ఐపీఓలో రిటైల్ పోర్షన్ కోసం ఏకంగా 8.5 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టగా, 2.72 రెట్లు మాత్రమే సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్ అయ్యాయి.  సెబీ రూల్ ప్రకారం, ఐపీఓ ఓవర్ సబ్‌‌స్క్రయిబ్ అయితే ఒక్కో ఇన్వెస్టర్‌‌‌‌కు ఒక లాట్ మాత్రమే అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుంది.  ఒక్కో లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 12 షేర్లు ఉండగా, ఈ మొత్తం 8.5 కోట్ల షేర్లు 70.86 లక్షల లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అవుతాయి.  రిటైల్ పోర్షన్ కింద కోటి అప్లికేషన్లు రావడంతో ప్రతి వంద మంది దరఖాస్తుదారుల్లో 70  మంది ఒక లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దక్కించుకున్నారు. 

కంపెనీ షేర్లు 22 శాతం లాభంతో లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కనీసం రూ.2,500 లాభం సంపాదించారు.  ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూస్తే జియో రూ.30,213 కోట్ల ఐపీఓ  22.19 రెట్లు సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది. ఇందులో  క్వాలిఫైడ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (క్యూఐబీ) విభాగం 70 రెట్లకు పైగా సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ సాధించింది.   జియో ఐపీఓ ఓపెన్ అయిన 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్ అయింది. ఏకంగా 1.34 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. యాంకర్ ఇన్వెస్టర్ల పోర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిపి మొత్తం రూ.7.4 లక్షల కోట్ల విలువైన షేర్ల కోసం 
బిడ్స్ దాఖలయ్యాయి.

20 ఏళ్ల తర్వాత!

 రిలయన్స్ గ్రూప్ నుంచి 20 ఏళ్ల తర్వాత  వచ్చిన తొలి ఐపీఓ ఇది. చివరిసారిగా 2006లో రిలియన్స్ పెట్రోలియం మార్కెట్‌‌లో లిస్ట్ అయ్యింది. జియో  తన ఐపీఓలో రూ.30,200 కోట్ల ఫ్రెష్ షేర్లను ఇష్యూ చేసింది. ఇందులో మెటా, గూగుల్ ఎలాంటి వాటాలనూ విక్రయించలేదు.  కాగా,  జియోకి 54 కోట్లకు పైగా యూజర్ బేస్ ఉంది.  ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన ఈ కంపెనీ, చైనా వెలుపల ఏకంగా 26.85 కోట్ల 5జీ యూజర్లతో అతిపెద్ద కస్టమర్ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. 

భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీతో 7,220 పేటెంట్లను  ఫైల్ చేసింది. కేవలం సాధారణ మొబైల్ సేవలకే పరిమితం కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్,  ఏఐ , ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ సేవలు, శాటిలైట్ కమ్యూనికేషన్స్ వైపు అడుగులేస్తోంది. నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాను ఇప్పటికే డెవలప్ చేయడంతో  భవిష్యత్తులో కంపెనీ వద్ద ఫ్రీ క్యాష్ ఫ్లో గణనీయంగా పెరిగే అవకాశం ఉందని  బ్రోకరేజ్ నోమురా విశ్లేషించింది.  జియో షేరుపై  నోమురా తన టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరను  రూ.1,340 గా నిర్ణయించగా, మోతీలాల్ ఓస్వాల్  రూ.1,350 ని ఇచ్చింది. టారిఫ్ పెంపు, బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాండ్ విస్తరణ కంపెనీ వృద్ధికి దోహదం చేస్తాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి.  

రిలయన్స్ గ్రూప్@ రూ.30 లక్షల కోట్లు 

జియో బంపర్ లిస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మొత్తం రిలయన్స్ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.30 లక్షల కోట్ల (318 బిలియన్ డాలర్లు) కు చేరింది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  లిస్టెడ్ కంపెనీల్లో 11 వ స్థానానికి ఎగిసింది. ఇండియాలో ఇప్పటివరకు అత్యంత విలువైన గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొనసాగిన టాటాలను  రిలయన్స్ అధిగమించింది. టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.25 లక్షల కోట్ల దగ్గర, అదానీ గ్రూప్ మార్కెట్ వాల్యూ రూ.18–20 లక్షల కోట్లు దగ్గర ఉన్నాయి.
 

గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు    మార్కెట్ క్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
ఎన్విడియా    5.26 ట్రిలియన్ డాలర్లు
యాపిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌    5.07 ట్రిలియన్ డాలర్లు
టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ    1.94 ట్రిలియన్ డాలర్లు
శామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌     1.15 ట్రిలియన్ డాలర్లు
టెన్సెంట్    442 బిలియన్ డాలర్లు
కోకా–కోలా    392.26 బిలియన్ డాలర్లు
పీ అండ్ జీ    369 బిలియన్ డాలర్లు
రిలయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
(11 వ స్థానం)     318 బిలియన్ డాలర్లు