- ఈదురు గాలులకు నేలవాలిన వరి
- రాష్ట్రంలో తుపానుప్రభావం అంతంతే
- బలహీనపడుతున్న తీవ్ర వాయుగుండం
హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను వణికించిన అతి తీవ్ర తుపాను ‘అర్నబ్’ తెలంగాణపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ తుపానైనా రాష్ట్రాన్ని కరుణిస్తుందని, తాగునీటి కష్టాలైనా గట్టెక్కవచ్చిని భావించినా నిరాశే మిగిలింది. రాష్ట్రంలో అతి భారీ వర్షాలు ముంచెత్తుతాయని, 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు ఉత్తవే అయ్యాయి. బుధవారం తెల్లవారుజామున ఏపీలోని బాపట్ల–
విశాఖపట్నం మధ్య తీరాన్ని తాకి బీభత్సం సృష్టించిన అర్నబ్ తుపాను ప్రభావం.. మన రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మోస్తరు వానలకే పరిమితమైంది.
ఏపీ తీరంలో పెను బీభత్సం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అతి తీవ్ర తుపాను ‘అర్నబ్’ బుధవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ఏపీ తీరాన్ని దాటింది. బాపట్ల–విశాఖపట్నం మధ్య, యానాంకు నైరుతి దిశగా తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్లు, గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు విరుచుకుపడ్డాయి. ఉదయం 8 గంటల సమయానికి తుపాను కేంద్ర ప్రాంతం పూర్తిగా భూభాగంలోకి ప్రవేశించడంతో తీరం దాటే ప్రక్రియ ముగిసింది. ఆ సమయంలో నరసాపూర్‌కు తూర్పు–ఈశాన్యంగా 20 కిలోమీటర్లు, యానాం, కాకినాడల వద్ద తుపాను కేంద్రీకృతమైంది. భూభాగంలోకి ప్రవేశించిన అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ సాధారణ తుపానుగా, ఆపై తీవ్ర వాయుగుండం (డీప్ డిప్రెషన్)గా బలహీనపడుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తేలిపోయిన ఐఎండీ ‘ఆరెంజ్’ హెచ్చరికలు
అర్నబ్ ధాటికి తెలంగాణలో భారీ వర్షాలు తప్పవని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ ఇచ్చింది. కానీ వాతావరణ శాఖ వేసిన అంచనాలు క్షేత్రస్థాయిలో తలకిందులయ్యాయి. తుపాను దిశ మార్చుకుని వేగంగా బలహీనపడటంతో తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆకాశం మేఘావృతమై మోస్తరు వానలు కురిశాయి.
హైదరాబాద్‌లో చల్లబడ్డ వాతావరణం..
అర్నబ్ వల్ల హైదరాబాద్‌లో ఉదయం నుంచే ఆకాశం దట్టంగా మేఘావృతమైంది. నగరంలో అక్కడక్కడా చిరుజల్లులు మినహా వర్షం పడలేదు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తప్ప ఏమీ లేదు. గురువారం కూడా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు (హేజ్) కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. కాగా, తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుండటంతో రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
