సర్కారీ కాలేజీల్లో వారానికి 3 రోజులు గుడ్లు..ఇంటర్ విద్యా డైరెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు 

సర్కారీ కాలేజీల్లో వారానికి 3 రోజులు గుడ్లు..ఇంటర్ విద్యా డైరెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో ఇంటర్​ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఉడకబెట్టిన గుడ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారంలో రోజు విడిచి రోజు మూడు రోజులు గుడ్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ మేరకు ఇంటర్​ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ ఉత్తర్వులు జారీ చేశారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల(ఏఏపీసీ) ఆధ్వర్యంలో స్థానిక మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులను ఎంపిక చేసి.. వారి ద్వారా గుడ్ల సేకరణ, ఉడకబెట్టడం, రవాణా, విద్యార్థులకు వడ్డించే బాధ్యతలను సక్రమంగా నిర్వహించేలా ప్రిన్సిపాళ్లు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఒక్కో గుడ్డుకు ప్రభుత్వం రూ.6 చొప్పున ధర ఖరారు చేసింది. గుడ్ల కొనుగోలు, ఉడకబెట్టడం, వడ్డించే ఖర్చులన్నీ ఈ రూ.6 పరిధిలోనే ఉంటాయని, విద్యార్థులకు వాస్తవంగా వడ్డించిన గుడ్ల సంఖ్య ఆధారంగానే నిధుల చెల్లింపులు జరుగుతాయని స్పష్టం చేశారు.