- ఢిల్లీలో ర్యాలీకి జనం భారీగా తరలివస్తారనే అదనపు బోగీలు ఇవ్వట్లే
- ‘పీఎస్ఆర్ యువ నేస్తం’తో నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్
- ఎంతమందికైనా ఏడాది ఫ్రీ ట్రైనింగ్, స్టడీ మెటీరియల్ పంపిణీ
- త్వరలోనే రాష్ట్రంలో మరో 15 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాలనలో నిరసనలకు తావులేకుండా ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తేసి ప్రజల గొంతు నొక్కిన బీఆర్ఎస్ నాయకులకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బుధవారం సెక్రటేరియెట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధర్నా చౌక్‌ను పునరుద్ధరించిందన్నారు.
నవంబర్ 2న హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్రపై స్పందిస్తూ.. ఢిల్లీలో నిరసనలను అడ్డుకుంటున్న బీజేపీ నాయకులు.. రాష్ట్రంలో యాత్రలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా నిరసనలు తెలిపే హక్కుంటుందని, ఆ స్వేచ్ఛను అన్ని పార్టీలకూ ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు వాడుతున్న భాష, హావభావాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు.
ప్రత్యేక బోగీలకు ఎందుకు అనుమతి ఇవ్వరు?
సర్‌తో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఓట్లు తీసేస్తున్నారని, అర్హులందరికీ తిరిగి ఓటు హక్కు కల్పించే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ అంశంపై నాలుగైదు నెలలుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నా కేంద్రం. ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్, ఇండియా కూటమి తలపెట్టిన భారీ ర్యాలీకి జనం రాకుండాకేంద్రం రైళ్లను కేటాయించడం లేదన్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రత్యేక బోగీలు అడిగినా పది రోజులుగా అనుమతులకు నిరాకరిస్తున్నారన్నారు. రైల్వేలు కేంద్రంలోని అధికార పార్టీ సొత్తు కాదని, అవి దేశ ప్రజల ఆస్తి అని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల వ్యవహారాలు, రైల్వేల వైఖరిపై ఆధారాలతో ప్రజాక్షేత్రంలో పోరాడుతామని మంత్రి స్పష్టం చేశారు.
దీపావళి నాటికి జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యకు పరిష్కారం
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించానని, దీపావళి నాటికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే రెండేండ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి వివరించారు. మరో 15 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నామన్నారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని చెప్పారు.
