- నీట మునిగిన గ్రేటర్ వరంగల్
- ఇప్పుడు అదేరోజు ఉమ్మడి జిల్లాకు చేరిన 'అర్నబ్' తుఫాన్
- ఉదయం నుంచి చల్లని ఈదురుగాలులు.. రాత్రి జోరువాన
వరంగల్, వెలుగు: అక్టోబర్ 28వ తేదీ ఓరుగల్లులో తుఫాన్ డే అన్నట్లు సీన్ రిపీట్ అయింది. గతేడాది ఇదేరోజు ఆంధ్రప్రదేశ్‍లో నెలకొన్న తుఫాన్ ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాలను అతలాకుతలం చేసింది. ఇప్పుడు సరిగ్గా అదే అక్టోబర్ 28న 'అర్నబ్' తుఫాన్ మళ్లీ జిల్లాకు చేరింది. నిన్నమొన్నటివరకు ఎండకాలాన్ని తలపించిన వాతావరణం ఒక్కసారిగా మార్చి వేసింది.
రికార్డు స్థాయి వర్షాలతో ఓరుగల్లు అతలాకుతలం..
గతేడాది ఆంధ్రప్రదేశ్‍లో ఏర్పడిన మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో ఓరుగల్లులో కుండపోతలా కురిసిన అతి భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించింది. రైల్వే స్టేషన్లలో పట్టాలమీదకు వరదనీరు చేరడంతో పలు రైళ్లను రద్దు చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడలో 246.3 మిల్లీమీటర్ల వర్షపాతం, పర్వతగిరి మండలంలోని కల్లెడలో 234.8, ఖిలా వరంగల్ మండలం ఉర్సు ప్రాంతంలో 224.0, సంగెం మండలంలోని కాపులకానిపర్తిలో 206.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. జోరుగా కురిసిన వానకు గ్రేటర్ వరంగల్ ట్రైసిటీ అతలకుతలమైంది. పైనుంచి వచ్చే గొలుసుకట్టు చెరువుల నుంచి వచ్చిన వరదతో హనుమకొండ గోపాల్పూర్‍లోని ఊర చెరువు తెగింది. సమ్మయ్య నగర్‍తో పాటు చుట్టూరా ఉండే 30 కాలనీలు నీటమునిగి ఏకంగా ఇండ్లలోకి నడుంలోతు నీరు చేరింది. జనాలు ఇండ్లలోని బురద క్లీన్ చేసుకోడానికి వారం పట్టింది.
గజగజ వణికిస్తున్న 'అర్నబ్'..
గతేడాది తరహాలోనే ఈ ఏడాది సరిగ్గా అక్టోబర్ 28న ఓరుగల్లుకు అర్నబ్ తుఫాన్ చేరింది. ఎల్‍నినో ప్రభావంతో ఈ ఏడాది వానలు కురవకపోగా ఉష్టోగ్రతలు ఎండకాలం మాదిరి నమోదయ్యాయి. ఈ క్రమంలో అర్నబ్ తుఫాన్ ప్రభావంతో బుధవారం తెల్లవారుజామునుంచే చల్లని ఈదురుగాలులు, మంచుపొగతో గజగజ వణికేలా చేసింది. తీరా.. రాత్రి సమయంలో గ్రేటర్ వరంగల్‌లో ఒక్కసారిగా జోరువాన మొదలైంది. చల్లని ఈదురుగాలులు, పొగమంచుతో ఉమ్మడి వరంగల్ కశ్మీర్ ప్రాంతాన్ని తలపించింది.
