విద్యుత్ కు వికాస్ రాజ్.. పర్యావరణానికి జయేశ్ రంజన్

విద్యుత్ కు  వికాస్ రాజ్.. పర్యావరణానికి జయేశ్ రంజన్
  • పంచాయతీరాజ్​కు నవీన్​ మిట్టల్​
  • 12 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
  • సర్ఫరాజ్ అహ్మద్​కు అదనపు బాధ్యతలు
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో 12 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పించడంతో పాటు మరికొందరికి కీలక శాఖల పూర్తి అదనపు బాధ్యతలను (ఎఫ్ఏసీ) అప్పగించింది. సీఎస్​ సంజయ్ జాజు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. పాలనాపరమైన అవసరాల మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, డైరెక్టర్ల స్థాయి అధికారులను బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏయూడీ) పరిధిలోని హెచ్ఎండీఏ లిమిట్స్ స్పెషల్ సీఎస్‌‌గా ఉన్న జయేష్ రంజన్‌‌తో పాటు రవాణా, రోడ్లు-భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, విద్యుత్ శాఖ బాధ్యతలు చూస్తున్న నవీన్ మిట్టల్ వంటి సీనియర్ అధికారులకు కొత్త బాధ్యతలు కేటాయించారు.  

సీనియర్ అధికారుల శాఖల కేటాయింపులు ఇలా.. 

1992 బ్యాచ్‌‌కు చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్‌‌ను పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ (ఈఎఫ్ఎస్ అండ్ టీ) శాఖ స్పెషల్ సీఎస్‌‌గా బదిలీ చేశారు. దాంతోపాటు ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌‌గా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.  ప్రస్తుతం పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్‌‌గా ఉన్న వాణీ ప్రసాద్‌‌కు క్రీడల శాఖ స్పెషల్ సీఎస్‌‌తో పాటు హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్‌‌గా ఎఫ్ఏసీ బాధ్యతలు ఇచ్చారు.

ఈ బాధ్యతల నుంచి జయేష్ రంజన్‌‌ను రిలీవ్ చేశారు. ఇప్పటివరకు రవాణా, రోడ్లు-భవనాల శాఖలో పనిచేసిన సీనియర్ అధికారి వికాస్ రాజ్‌‌ను విద్యుత్​ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఇక విద్యుత్ శాఖ నుంచి నవీన్ మిట్టల్‌‌ను బదిలీ చేశారు. ఎల్​నినో నేపథ్యంలో కరెంట్​ డిమాండ్​ పెరినప్పటికీ యదాద్రి పవర్​ ప్లాంట్​ను  పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంలో నిర్లక్ష్యం వహించడంపై ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి సీరియస్​ అయ్యారు. అందువల్లే ఆయనను బదిలీ చేసి  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎస్ఏడీ శాఖల స్పెషల్ సీఎస్‌‌గా నియమించినట్లు తెలుస్తోంది.  ఇప్పటివరకు ఈ శాఖలను పర్యవేక్షించిన ఎం.దానకిశోర్ స్థానంలో నవీన్ మిట్టల్ బాధ్యతలు చేపట్టనున్నారు.

సర్ఫరాజ్​కు ఎంఏయూడీ బాధ్యతలు

హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌‌కు అదనపు బాధ్యతలు కేటాయించారు. ఎంఏయూడీ (హెచ్ఎండీఏ లిమిట్స్) కార్యదర్శితో పాటు జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల స్పెషల్ ఆఫీసర్‌‌గా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇప్పటివరకు ఈ విధులను నిర్వహించిన జయేష్ రంజన్ బదిలీ కావడంతో సర్ఫరాజ్ అహ్మద్‌‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇక 2013 బ్యాచ్ అధికారి  శ్రుతి ఓఝాను మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమ శాఖ (డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ) ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు.  1997 బ్యాచ్ అధికారిణి శైలజా రామయ్యర్‌‌ను దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.

ప్రస్తుతం విపత్తు నిర్వహణ (డీఎం) శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఈ పోస్టులో ఎఫ్ఏసీగా ఉన్న సబ్యసాచి ఘోష్‌‌ను రిలీవ్ చేశారు. అలాగే బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎఫ్ఏసీ బాధ్యతల్లో రాహుల్ బొజ్జా యథావిధిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు 2005 బ్యాచ్ అధికారి ఇలంబరితిను రవాణా, రోడ్లు-భవనాల శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయనకు రవాణా శాఖ కమిషనర్‌‌గా ఎఫ్ఏసీ అప్పగించడంతో పాటు, ప్రస్తుతం నిర్వహిస్తున్న పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ కార్యదర్శి బాధ్యతల్లోనూ 
కొనసాగించారు.


హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్​ డైరెక్టర్​గా ముషారఫ్​

వైద్యారోగ్య, విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులను కూడా బదిలీ చేశారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్​పీడీసీఎల్​) సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీని కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌‌గా బదిలీ చేశారు. ఆయనకు ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌‌గా ఫుల్​అడిషనల్​చార్జ్​ ఇవ్వడంతో పాటు టీజీఎస్​పీడీసీఎల్ సీఎండీగా అదనపు బాధ్యతలను కొనసాగించారు. అక్కడున్న డాక్టర్  సంగీత సత్యనారాయణను మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌‌గా బదిలీ చేశారు. టీజీఎస్​పీడీసీఎల్ సీఎండీగా ఉన్న జితేశ్​ వీ పాటిల్‌‌కు టీజీ రెడ్కో వైస్ చైర్మన్ అండ్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతల నుంచి ముషారఫ్ అలీ ఫారూఖీని రిలీవ్ చేశారు. బదిలీ అయిన అధికారులంతా వెంటనే తమ కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.