ఓబీసీ కాలమ్ లేకుంటే  జనగణనను అడ్డుకోవాలి: కవిత

ఓబీసీ కాలమ్ లేకుంటే  జనగణనను అడ్డుకోవాలి: కవిత
  • ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కవిత
  • తమిళనాడు తరహాలో స్పెషల్ సెషన్ పెట్టాలి
  • భవిష్యత్ తరాలకు మనమిచ్చే ఆస్తి రిజర్వేషన్లే 
  • వాటిని తీసేసేందుకు బీజేపీ సర్కారు కుట్ర
  • వచ్చే నెల జంతర్ మంతర్ వద్ద ఓబీసీ సంఘాలు 
  • నిర్వహించే  ధర్నాలో మేమూ పాల్గొంటం
  • హైదరాబాద్ ఓబీసీ డిక్లరేషన్ సభలో టీఆర్ఎస్ చీఫ్ కవిత

 

హైదరాబాద్, వెలుగు: జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్రం ఓబీసీ కాలమ్ పెట్టకపోతే రాష్ట్రంలో జనగణనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, తెలంగాణ బీసీ రైట్స్ ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం బాగ్‌‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన హైదరాబాద్ ఓబీసీ డిక్లరేషన్ సభలో ఆమె మాట్లాడారు. జనగణనలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్‌‌తో పాటు డ్రాప్ డౌన్ బాక్స్ ఉండాల్సిందేనని, ఇందుకోసం పార్టీలకు అతీతంగా అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. జనగణన కోసం కేంద్రం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, ఇంత ఖర్చు చేసి కూడా ఓబీసీల లెక్క తేల్చకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఓబీసీ కాలమ్ డిమాండ్‌‌తో నవంబర్‌‌లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓబీసీ సంఘాలు నిర్వహించే ధర్నాలో తాము పాల్గొంటామని ప్రకటించారు. 

అసెంబ్లీలో తీర్మానం చేయాలి

జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చేలా కేంద్రంపై తమిళనాడు తరహాలో ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. బీసీల విషయంలో సీఎం రేవంత్‌‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోవాలని తాము ఉద్యమిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తుచేశారు. ఆ బిల్లు కేంద్రం వద్ద ఆగిపోయినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని ప్రకటించిన సీఎం, ఆ తర్వాత 30 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లినా అఖిలపక్షాన్ని మాత్రం తీసుకెళ్లలేదని విమర్శించారు.  

రిజర్వేషన్లు తీసేసే కుట్ర

కేంద్రంలోని బీజేపీకి రిజర్వేషన్లంటే గిట్టదని, ఇప్పుడున్న రిజర్వేషన్లనే తీసేసే కుట్ర చేస్తోందని కవిత ఆరోపించారు. ఓబీసీల లెక్క తేలితే జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందనే కావాలని ప్రత్యేక కాలమ్ పెట్టడం లేదన్నారు. 

మనమిచ్చే ఆస్తి ఇవే..

భవిష్యత్ తరాలకు మనమిచ్చే అమూల్యమైన ఆస్తి రిజర్వేషన్లేనని కవిత అన్నారు. భూములు, బంగారం ఒకటి రెండు తరాలకే ఉంటాయని, రిజర్వేషన్లు తరతరాలకు మేలు చేస్తాయని చెప్పారు. దేశ బడ్జెట్ ఏడాదికి రూ.50 లక్షల కోట్లు ఉంటే, బీసీలకు ఏటా రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు చేయడం లేదని, అంటే ఒక్కో మనిషికి కనీసం ఒక్క బఠాణీ కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కవిత సైక్లోన్‌‌తో మోదీ కుర్చీ ఊడుతది: సూరజ్ మండల్

కవిత తెచ్చే సైక్లోన్‌‌తో ఓటు చోరీకి పాల్పడుతూ, ఓబీసీలకు అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీ అధికార పీఠం ఊడటం ఖాయమని బీపీ మండల్ మనవడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ అన్నారు. దేశంలో సగానికి పైగా ఉన్న ఓబీసీల కోసం ధైర్యంగా ముందుకొచ్చిన కవిత భవిష్యత్తులో తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. 


డిక్లరేషన్​లో అంశాలివీ..

  •     దేశ వ్యాప్తంగా జనగణన చేపట్టాలి, ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి.
  •     ప్రతి కులానికి యూనిక్ కోడ్ ఉండాలి.
  •     విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా ఇవ్వాలి.
  •     1931 జనగణన ప్రకారం బీసీల జనాభా 52 శాతం.. దానికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు 50 శాతం ఉండాలి.
  •     50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ తీసేయాలి. దీనివల్ల బీసీలకు నష్టం జరుగుతుంది.
  •     బీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి.
  •     వర్సిటీల్లో సోషల్ జస్టిస్ ఉండాలి.
  •     ప్రైవేట్ సెక్టార్ లో రిజర్వేషన్లు అమలు చేయాలి.