- కంప్యూటర్ టీచర్, లైబ్రేరియన్లు కూడా!..
- ఔట్ సోర్సింగ్ ద్వారా పోస్టుల భర్తీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని తెలంగాణ మోడల్ స్కూళ్లలో 4 కేటగిరీల పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ చర్యలు చేపట్టింది.194 స్కూళ్లలో ఆర్ట్, యోగా, కంప్యూటర్ టీచర్లతో పాటు లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మోడల్ స్కూళ్లు లేని హైదరాబాద్, మేడ్చల్-, గద్వాల, భద్రాద్రి జిల్లాలను మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల పరిధిలోని మోడల్ స్కూళ్లలో ఈ నియామకాలు జరగనున్నాయి. ఈ పోస్టుల కాలపరిమితి నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లైబ్రేరియన్కు నెలకు రూ.19500, మిగిలిన 3 పోస్టులకు నెలకు రూ.22,750 వేతనం ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలని స్పష్టం చేశారు. రోస్టర్, రిజర్వేషన్లు, విద్యార్హతల ప్రకారం ఎంపిక పారదర్శకంగా జరగాలని కలెక్టర్లను కోరారు.
