నైని బొగ్గు గని సమీపంలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్!..800 మెగావాట్ల చొప్పున 3 యూనిట్లకు ప్లాన్

నైని బొగ్గు గని సమీపంలో  సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్!..800 మెగావాట్ల చొప్పున 3 యూనిట్లకు ప్లాన్
  • రూ.25 వేల కోట్ల పెట్టుబడితో అల్ట్రా సూపర్ క్రిటికల్ విధానంలో ఏర్పాటు 
  •     సుమారు 800 ఎకరాల భూమి అవసరం
  •     ల్యాండ్ సర్వే, భూ సేకరణకు అనుమతించాలని అంగుల్ జిల్లా కలెక్టర్​కు సింగరేణి సీఎండీ విజ్ఞప్తి
  •     అనుమతులు వస్తే తప్పనున్న రవాణా భారం

హైదరాబాద్, వెలుగు: ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గని సమీపంలో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్​ప్లాంట్​ఏర్పాటు చేయాలని సింగరేణి భావిస్తోంది. సుమారు రూ.25 వేల కోట్ల పెట్టుబడితో 800 మెగావాట్ల చొప్పున మూడు యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. బొగ్గు గనికి దగ్గర పిట్ హెడ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల రవాణా భారం తగ్గుతుందని భావిస్తున్నది. ఇందుకు సంబంధించిన ప్రైమరీ డిటైల్డ్ రిపోర్ట్​ రెడీ చేసింది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 800 ఎకరాల భూమి అవసరం ఉండగా, సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్​ జ్యోతి ఇటీవల అంగూల్ జిల్లా కలెక్టర్​ను కలిసి ల్యాండ్ సర్వే, భూ సేకరణకు అనుమతించాలని కోరారు. 

అల్ట్రా సూపర్ క్రిటికల్ విధానంలో నిర్మాణం..

ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గనిని కేంద్ర ప్రభుత్వం 2015లో సింగరేణి సంస్థకు కేటాయించింది. ఈ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌లో దాదాపు 340 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా, ఏటా 10 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో 36 నుంచి 38 ఏండ్ల పాటు బొగ్గు తవ్వనున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తి అయిన బొగ్గును మంచిర్యాల జిల్లా జైపూర్​లోని సింగరేణి థర్మల్ పవర్​ ప్లాంట్, యాదాద్రి పవర్ ప్లాంట్​కు సరఫరా చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెరిగే కొద్ది నైనీ బొగ్గు గని సమీపంలోనే మొదట 1,600 మెగావాట్ల పిట్ హెడ్​ థర్మల్​ పవర్ ప్లాంట్ నిర్మించాలని సింగరేణి భావించింది. ఆ తర్వాత దీనిని 2,400 మెగావాట్లకు పెంచుతూ అల్ర్టా సూపర్ క్రిటికల్​ విధానంలో 800 మెగావాట్ల చొప్పున మూడు యూనిట్స్ నిర్మించాలని భావిస్తున్నది.
 
రూ.25 వేల కోట్ల పెట్టుబడికి రెడీ..
నైనీ వద్ద పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ.25 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు సింగరేణి సిద్ధమైనది. భూసేకరణకు రూ.200 నుంచి రూ.350 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. నైనీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు తీసుకురావాలంటే సుమారు 1,100 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. రైల్వే రేక్, లోడింగ్, అన్ లోడింగ్ తదితర ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. అదే బొగ్గు గని సమీపంలోనే ప్లాంట్ నిర్మాణం వల్ల రవాణా ఖర్చులు కలిసి రావడంతో పాటు కరెంట్​తో ఆదాయం వస్తుందని ఇంజినీర్లు భావిస్తున్నారు. మొత్తంగా యూనిట్ విద్యుత్​ ఉత్పత్తి ఖర్చు కూడా రూ.2 వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. భూసేకరణకు ఒడిశా సర్కారు నుంచి గ్రీన్​ సిగ్నల్ రాగానే డిటైల్డ్ ప్రాజెక్ట్​ రిపోర్ట్​ రెడీ చేసి కేంద్రం నుంచి పర్యావరణం, ఫారెస్ట్ తదితర అనుమతులు తీసుకుంటామని, వీలైనంత త్వరగా పవర్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని పెడతామని ఆఫీసర్లు తెలిపారు.  

800 ఎకరాల భూ సేకరణ..
నైనీ బొగ్గు గనికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో చెండిపడా ప్రాంతం థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని గుర్తించిన సింగరేణి ఇంజినీర్లు తుకుడా, జరపడా గ్రామాల్లోని భూసేకరణ చేయాలని భావిస్తున్నారు. సుమారు 800 ఎకరాల భూమిని ఒడిశా ఇండస్ట్రియల్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (ఐడీసీవో) ద్వారా సింగరేణికి కేటాయించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. అక్టోబర్​ 26, 27వ తేదీల్లో సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్​జ్యోతి స్వయంగా అంగూల్ జిల్లాకు వెళ్లి కలెక్టర్ మహ్మద్ అబ్దాల్ అక్తార్ తో ఈ అంశంపై చర్చించారు. ల్యాండ్ సర్వే చేసి.. భూ సేకరణకు అనుమతించాలని కోరారు. ఇక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్​ ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల అవసరాలకు ఉపయోగించుకోవచ్చని వివరించారు.