- సెప్టెంబర్ నుంచే ఐఎస్ఎంఎస్ పోర్టల్ ద్వారా ప్రాసెసింగ్
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో అమలు చేస్తున్న పాలు, బ్రేక్‌ఫాస్ట్ బిల్లుల చెల్లింపు ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై ఈ బిల్లులన్నింటినీ ఐఎస్ఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే రూపొందించి, ప్రాసెస్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన బిల్లుల నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ, రాష్ట్రంలోని డీఈవోలు, ఎంఈవోలు, హెచ్‌ఎంలకు మార్గదర్శకాలు జారీ చేశారు.
రాష్ట్రంలో విద్యార్థుల పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి విడతల వారీగా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం అక్షయపాత్ర, మన్నా ట్రస్ట్, హెచ్‌కేఎం చారిటబుల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో 12 సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా 16 జిల్లాల్లోని 4,160 పాఠశాలల్లో 3.50 లక్షల మంది విద్యార్థులకు ఉదయం టిఫిన్‌తో పాటు పాలు అందిస్తున్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు బిల్లులను ఆఫ్‌లైన్ విధానంలో చెల్లించగా, నిధుల్లో పారదర్శకత కోసం సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.
ఒక్కరు ఆలస్యం చేసినా.. అందరి బిల్లులు బంద్
విద్యార్థుల సంఖ్య, కేటగిరీల వారీగా ఇండెంట్, సరఫరా వివరాలను సరిచూసుకొని మొత్తం 13 విభాగాల్లో బిల్లులను నమోదు చేయాలి. దీనిలో ప్రీ-ప్రైమరీ నుంచి 5వ తరగతి, 6 నుంచి 10వ తరగతి వరకు జనరల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల బ్రేక్‌ఫాస్ట్, పాల సరఫరా, కాగబెట్టే ఖర్చులతో పాటు సిబ్బంది బ్రేక్‌ఫాస్ట్ ఖర్చులను లెక్కించి ఎంఈవోకు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్‌లైన్ ప్రక్రియలో సీక్వెన్షియల్ వర్క్‌ఫ్లో విధానం ఉంటుందని, మండల పరిధిలోని హెడ్మాస్టర్లంతా బిల్లులను సమర్పిస్తేనే ఎంఈవో లాగిన్‌లో ఏకీకృత బిల్లు కనిపిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఏ ఒక్క హెచ్ఎం ఆలస్యం చేసినా ఎంఈవో లాగిన్ ఓపెన్ కాదని, అలాగే ఎంఈవోలు పంపితేనే డీఈవోలకు, డీఈవోలు పంపితేనే డైరెక్టరేట్ స్థాయికి బిల్లులు చేరుతాయని హెచ్చరించారు.
