35 మంది జేఎల్స్ను విధుల్లోకి తీసుకోవాలి..ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు

35 మంది జేఎల్స్ను విధుల్లోకి తీసుకోవాలి..ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు:  నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారన్న ఆరోపణలతో విచారణ జరపకుండా 35 మంది జూనియర్ లెక్చరర్లను ఉద్యోగాల నుంచి తొలగించడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 1న వారిని తొలగిస్తూ ఇంటర్​విద్యాశాఖ డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ బుధవారం మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. తొలగించిన వారందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

కానీ చట్టప్రకారం శాఖాపరమైన విచారణ చేపట్టేందుకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కావని పేర్కొంది. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.శరత్ విచారణ చేపట్టారు. 2023 మే 3న 3 వేల మందికిపైగా కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ ప్రక్రియలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారన్న ఆరోపణలతో 35 మందిని తొలగించడాన్ని సవాలు చేస్తూ బాధితులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

పిటిషనర్లకు తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా తొలగింపు ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. అప్పీలు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని సూచించింది.