ఏపీని కుదిపేసిన అర్నబ్ కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. ఏడుగురు మృతి

ఏపీని కుదిపేసిన అర్నబ్  కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. ఏడుగురు మృతి
  •     రోడ్లపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
  •     విశాఖలో అత్యధికంగా 315 మి.మీ. వర్షపాతం
  •     శంషాబాద్, ఏపీ మధ్య  33 విమానాలు రద్దు
  •     కొత్తవలస- కిరండూల్ రైల్వే మార్గంలో దెబ్బతిన్న ట్రాక్
  •     మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం
  •     ఇవాళ కూడా భారీ వర్షాలు: వాతావరణ శాఖ

 

హైదరాబాద్, వెలుగు: అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ఈదురుగాలులు, భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈ ప్రమాదాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నంలోని పాత గోశాల, బాలాజీనగర్ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడి ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చెట్టు కూలి ఒకరు, విద్యుత్ తీగలు తగిలి మరొకరు మృతి చెందారు. కోనసీమ జిల్లాలో వృద్ధురాలితో పాటు మరో మహిళ గుడిసె కూలి ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో రోడ్డుపై పడిన విద్యుత్ తీగలు తగిలి మరో మహిళ మృతి చెందారు. 


తుపాను ప్రభావంతో నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులో చాపరాయి జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఘాట్ రోడ్డులో రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తవలస– కిరండూల్ రైల్వే మార్గంలో ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా ఆపేశారు. గుంటూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లోనూ లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై చెట్లు విరిగిపడటం, భారీగా వరద చేరడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. భద్రతా చర్యల్లో భాగంగా శంషాబాద్, ఏపీల మధ్య నడవాల్సిన మొత్తం 33 విమానాలను అధికారులు రద్దు చేశారు.

జిల్లాల వారీగా వర్షపాతం

అర్నబ్ అతి తీవ్ర తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం 8:30 గంటల వరకు విశాఖపట్నంలో అత్యధికంగా 315 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా విజయనగరంలో 301, అనకాపల్లిలో 275 , శ్రీకాకుళంలో 257, కృష్ణాలో 223 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం

తుపాను ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం మొదటి నుంచీ అప్రమత్తంగా పనిచేసింది. సీఎం చంద్రబాబు అమరావతిలోని సచివాలయంలో ఉన్న ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పరిస్థితిని నిరంతరం సమీక్షించారు. సేఫ్టీ, సెక్యూరిటీ, రిహాబిలిటేషన్ విధానాలను అనుసరిస్తూ అధికారులను సమన్వయం చేశారు. గతంతో పోలిస్తే ముందస్తు జాగ్రత్తల వల్ల ప్రాణనష్టం చాలావరకు తగ్గిందని సీఎం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా పర్యటించి లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను పరిశీలించారు. అధికారుల సహాయక చర్యలను అభినందించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. జనసైనికులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొని బాధితులకు ఆహారం అందించాలని, అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చారు.

మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం

తుపాను బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. తుపాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం తెలిపారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ. 10 వేలు, పునరావాస కేంద్రాల్లోని వారికి 3 వేల రూపాయల వరకు సాయం అందిస్తామన్నారు. కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు దెబ్బతింటే రూ. 25 వేలు, ఎంఎస్‌‌‌‌ఎంఈ పరిశ్రమల టర్నోవర్‌‌‌‌ను బట్టి రూ. 50 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక సహాయం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, దెబ్బతిన్న బైకులకు రూ. 3 వేలు, త్రిచక్ర వాహనాలకు రూ. 10 వేలు, మత్స్యకారుల బోట్లు, వలల మరమ్మతులకు రూ. 3 వేల నుంచి రూ. 25 వేల వరకు పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఇది

అతి తీవ్ర తుపానుగా మారిన అర్నబ్.. క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే దీని ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని హెచ్చరించారు. గురువారం కూడా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ముప్పు ఉందని హెచ్చరించారు. డోప్లర్ వెదర్ రాడార్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు తుపాను కదలికలను గమనిస్తున్నారు. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వాతావరణం అనుకూలించని ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్లా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం తెలిపింది. శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లి జిల్లాల ప్రజలు గురువారం సాయంత్రం వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నందున ఎవరూ నీటిలోకి వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని, నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చింది.