జనం ఊపిరి పీల్చుకునే వార్త: తీరం దాటిన అర్నాబ్‌ తుఫాన్‌.. క్రమంగా బలహీనం..!

జనం ఊపిరి పీల్చుకునే వార్త: తీరం దాటిన అర్నాబ్‌ తుఫాన్‌.. క్రమంగా బలహీనం..!

ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని దాటిన తీవ్ర తుఫాన్‌ ‘అర్నాబ్‌’ క్రమంగా బలహీనపడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)  వెల్లడించింది. బుధవారం (అక్టోబర్ 28) ఉదయం 11:30 గంటల సమయానికి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ నర్సాపూర్‌ సమీపంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది.

నర్సాపూర్‌ సమీపంలో తుఫాన్‌ కేంద్రం..

ఐఎండీ నివేదిక ప్రకారం.. తుఫాన్‌ కేంద్రం 16.6° ఉత్తర అక్షాంశం, 81.8° తూర్పు రేఖాంశం వద్ద ఉంది. నర్సాపూర్‌కు ఉత్తర-ఈశాన్యంగా 20 కిలోమీటర్లు, యానాంకు దక్షిణ-నైరుతిగా 44 కిలోమీటర్లు, కాకినాడకు దక్షిణ-నైరుతిగా 60 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు-ఈశాన్యంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించింది.

మరో 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం..

తీరం దాటిన అనంతరం తుఫాన్‌ క్రమంగా బలహీనపడుతోందని ఐఎండీ తెలిపింది. తదుపరి ఆరు గంటల్లో తీవ్ర తుఫాన్‌ స్థాయి నుంచి తుఫాన్‌ స్థాయికి, ఆ తర్వాతి ఆరు గంటల్లో వాయుగుండం స్థాయికి బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేసింది. రానున్న 48 గంటల్లో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది.

ALSO READ : ఏపీలో MPTC, ZPTC ఎన్నికలు రీషెడ్యూల్.. కారణం ఇదే..!

మచిలీపట్నం రాడార్‌తో పర్యవేక్షణ..

తుఫాన్‌ కదలికలను మచిలీపట్నంలోని డాప్లర్‌ వాతావరణ రాడార్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఐఎండీ వెల్లడించింది. తుఫాన్‌ బలహీనపడుతున్నప్పటికీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం వెంటనే పూర్తిగా తగ్గిపోతుందని భావించకూడదు. ప్రజలు అధికారులు జారీ చేసే తాజా హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.