చూడ్డానికే వాంతి వచ్చేలా ఉంది : టాయిలెట్ థీంతో రెస్టారెంట్ ఏంట్రా.. ఎలా తింటున్నారా బాబూ..!

చూడ్డానికే వాంతి వచ్చేలా ఉంది : టాయిలెట్ థీంతో రెస్టారెంట్ ఏంట్రా.. ఎలా తింటున్నారా బాబూ..!

సాధారణ హోటల్‌కు వెళ్లి టేబుల్‌పై కూర్చుని భోజనం చేయడం మనకు అలవాటు. కానీ అదే హోటల్‌లో కుర్చీలకు బదులుగా టాయిలెట్ సీట్లు, గ్లాసులకు బదులుగా యూరినల్ ఆకారపు పాత్రలు, ప్లేట్లకు బదులుగా టాయిలెట్ బౌల్స్ కనిపిస్తే..? వామ్మో.. అక్కడ తినగలమా అని అనిపించడం సహజమే ! అచ్చం ఇలాంటి వింత అనుభవాన్ని పరిచయం చేసింది తైవాన్‌లోని ఓ రెస్టారెంట్. అక్కడి దృశ్యాలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతుండగా, మరికొందరు మాత్రం అక్కడ భోజనం చేయడానికి మీకు ధైర్యం సరిపోతుందా అని ఆలోచిస్తున్నారు.

టాయిలెట్ బౌల్‌లో ఫుడ్.. యూరినల్‌లో డ్రింక్స్!
తైవాన్‌లోని ఈ టాయిలెట్ థీమ్ రెస్టారెంట్‌కు సంబంధించిన వీడియోను ఇండియన్ కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సాధారణ హోటళ్లకు పూర్తి వేరేలా  ఉండే ఈ రెస్టారెంట్‌లో అడుగుపెడితే చాలు.. ప్రతి వస్తువూ టాయిలెట్ థీమ్‌తోనే కనిపిస్తుంది.

ఇక్కడ కస్టమర్లు సాధారణ కుర్చీలపై కాకుండా టాయిలెట్ సీట్లపై కూర్చుని భోజనం చేస్తారు. పానీయాలను యూరినల్ ఆకారపు పాత్రల్లో అందిస్తారు. ఇక ఆహారం విషయానికొస్తే, ప్లేట్లకు బదులుగా చిన్న చిన్న టాయిలెట్ బౌల్స్‌లో వడ్డిస్తారు. టాయిలెట్ హాట్‌పాట్స్ నుంచి ‘పూప్ కర్రీస్’ వరకు ఈ రెస్టారెంట్ మెనూలో ఎన్నో వింత వంటకాలు ఉన్నాయని వివరించారు.

అసహ్యం కలిగించే రూపం.. కానీ అదిరిపోయే అనుభవం!
ఈ రెస్టారెంట్‌లో వడ్డించే ఆహారాన్ని చూసి కొందరికి తినాలనే ఆసక్తి పోవచ్చు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌ కంటెంట్ క్రియేటర్ మాత్రం ఈ వింత అనుభవాన్ని సరదాగా ఆస్వాదించారు. ఇక్కడి ఫుడ్ టెస్ట్ కి 10కి 5 మార్కులు ఇచ్చిన ఆమె, రెస్టారెంట్ కాన్సెప్ట్‌కు మాత్రం ఏకంగా 10కి 10 మార్కులు ఇచ్చారు.

ముఖ్యంగా అక్కడ అందించే చాక్లెట్ సాఫ్ట్ సర్వ్ ఐస్‌క్రీమ్ ఆమెను బాగా ఆకట్టుకుంది. అది చూడటానికి ఎంత వాస్తవికంగా ఉందంటే, ఇకపై డార్క్ చాక్లెట్ ఐస్‌క్రీమ్‌ను కూడా ఇంతకుముందుల చూడలేనేమోనని ఆమె సరదాగా అన్నారు.

 ఇలాంటి వింతలు చాలానే ఉన్నాయట!
టాయిలెట్ థీమ్ రెస్టారెంట్ ఒక్కటే కాదు.. తైవాన్‌లో బీటిల్ కేఫ్‌లు, అల్పాకా రెస్టారెంట్లు వంటి వెరైటీ  థీమ్‌తో నడిచే రెస్టారెంట్లు  కూడా ఉన్నాయని ఆకాంక్ష చెప్పారు. అక్కడి రెస్టారెంట్లలో కనిపించే కొత్తదనం చూస్తే, అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో అనిపించక మానదు.

ఒకప్పుడు 19 శాఖలు.. ఇప్పుడు రెండే!
ఆమె తన వీడియో క్యాప్షన్‌లో తెలిపిన వివరాల ప్రకారం, చిన్న పేపర్  స్క్వాట్ టాయిలెట్లలో చాక్లెట్ ఐస్‌క్రీమ్ అమ్మడంతో ఈ రెస్టారెంట్ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత క్రమంగా విస్తరించి తైవాన్ అంతటా 19 శాఖలకు చేరుకుంది. అయితే ప్రస్తుతం తైపీలో కేవలం రెండు రెస్టారెంట్లే  ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

ఈ వింత రెస్టారెంట్‌ను సందర్శించాలనుకునేవారికి లొకేషన్ కూడా ఆమె సూచించారు. ఈ రెండు రెస్టారెంట్లు  రెండో అంతస్తులో ఉన్నాయని, వీకెండ్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిదని తెలిపారు.

మరి మీరు అక్కడ తినగలరా?
రెస్టారెంట్‌లోని వింత డెకరేషన్స్, టాయిలెట్ ఆకారపు పాత్రలు ఒకవైపు నవ్వు తెప్పిస్తుంటే, మరోవైపు ఆహారం తినగలమా అనే సందేహాన్ని కూడా కలిగిస్తున్నాయి. కొందరికి ఇది కొత్త అనుభవం కావచ్చు.. మరికొందరికి మాత్రం ఊహించుకోవడమే కష్టంగా అనిపించవచ్చు.

అందుకే ఆమె తన వీడియో చివర్లో అడిగిన ప్రశ్న ఇప్పుడు నెటిజన్లను ఆలోచించేల చేస్తుంది.  ఇలాంటి రెస్టారెంట్‌లో మీకు ఇష్టమైన వంటకాన్ని టాయిలెట్ బౌల్‌లో వడ్డిస్తే.. మీరు ధైర్యంగా తింటారా ? లేక రెస్టారెంట్‌లోకి అడుగుపెట్టగానే వెనక్కి తిరిగి వచ్చేస్తారా ?