భార్యాభర్తలు, లవర్స్ అన్నాక చిన్న చిన్న గొడవలు రావడం సహజం. కానీ ఆ గొడవలు పెద్దవి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పార్ట్నర్ దే. చిన్నదైనా.. పెద్దదైనా ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు అసలు ఆ గొడవకు కారణాలేంటో ఇద్దరూ తెలుసుకోవాలి. ఆ తరువాత పార్ట్నర్స్ లో ఎవరు కోపంలో ఉన్నా వారి కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయం.. భాగస్వామి కోపం తగ్గించాలంటే ఏదో మామూలుగా సారీ చెప్పేయడం కాదు. కాస్త యునిక్ గా "సారీ' చెప్పాలి. ఇలా చేస్తే ఎంత కోపంలో ఉన్నవారైనా వెంటనే కామ్ అయిపోతారు.
కోపానికి కారణమైతే..
భార్యాభర్తలో, లవర్స్ మధ్య ఎవరివల్ల అవతలి వాళ్లకు కోపం వచ్చిందో.. వాళ్లే అవతలివాళ్ల కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. అది కూడా పార్ట్నర్ ఇష్టాయిష్టాలను దృష్టిలో పెట్టుకుని హ్యాండిల్ చేయాలి. భాగస్వామిని తనకు ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లడం, ఇష్టమైన ఫుడ్ తినిపించడం, వాళ్ళకు బాగా ఇష్టమైన వారి గురించి మాట్లాడటం.. వంటివి చేస్తే చాలా వరకు కోపంలో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా మారతారు. ఇలా బయటకు వెళ్లినప్పుడే పార్ట్నర్ కు సారీ చెప్పాలి.
అదే ముఖ్యం
సారి.. అన్న మాట చాలా విలువైనది. అది ఎప్పుడు? ఎక్కడ ? ఉపయోగించాలో అప్పుడే ఉపయోగించాలి. అలాగే దాన్ని చెప్పే విధానం కూడా ఒకటుంటుంది. ఏదో చెప్పాలి అన్నట్లు కాకుండా ఎదుటివాళ్లకు తమపై మళ్లీ ప్రేమ పుట్టేవిధంగా 'సారీ' చెప్పాలి. అప్పుడే ఎదుటివాళ్లు అపాలజీని అంగీకరించగలరు. అలాగే ఒకవేళ నోటితో సారీ చెబితే ఎలా రియాక్ట్ అవుతారోనన్న భయం ఉంటే దాన్ని చాలా రకాలుగా చెప్పొచ్చు. ఒక పేపర్ పై అందంగా "సారీ" రాసి లేదా మంచి కొటేషన్ తో మెసేజ్ చేసి ఎదుటివాళ్లకు సారీ
చెప్పొచ్చు.
ఎక్కడ తగ్గాలో తెలియాలి
పార్ట్నర్స్ విషయంలో ఎవరూ తగ్గకపోవడం వలనే ఎక్కువగా గొడవలు వస్తుంటాయి. అయితే ఇలా గొడవలు జరిగిన తరువాత ఎవరో ఒకరు తగ్గాలి. దానివల్ల సమస్యలు పెద్దవి కాకుండా ఉంటాయి. ఎదుటివాళ్లపై ఎంత కోపం వచ్చినా.. నచ్చకపోయినా తగ్గి.. కాసేపు నెమ్మదిగా ఉండటం వల్ల మళ్లీ ఇద్దరూ మామూలుగా అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా తగ్గినప్పుడే పార్ట్నర్ను క్షమించమని అడగాలి.
మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి
ఎన్నిరకాలుగా కోపం పోగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నా ఎదుటివాళ్లు కూల్ కాకపోతే, కాస్త టైం తీసుకుని మళ్లీ ప్రయత్నించాలి. అంతేగాని
వదిలేయకూడదు. అవతలివాళ్లు చెప్తున్న సారీని వారు ఆక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇంకా బాధగా ఉందని వాళ్లకు చెప్పాలి. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు, కలిసి ఇష్టపడి కొన్న వస్తువులు, గిఫ్ట్స్ ఇలా ఏదో ఒక సందర్భాన్ని కల్పించుకుని హ్యాపీ మూడ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.
ఒక్క హగ్ తో...
చాలామందికి దూరం నుంచి ఎన్ని సార్లు 'సారీ' చెప్పినా కరగకపోవచ్చు. కానీ అలాంటివాళ్ళకి ప్రేమతో ఒక టచ్ తో సారీ చెబితే ఈజీగా కరిగిపోతుంటారు. కాబట్టి సమయం, సందర్భం చూసుకుని ఒక హగ్ ఇచ్చి సారీ చెప్పాచ్చు. ఆప్యాయంగా నుదుటిపై ముద్దు పెడుతూ చెప్పొచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో టచ్ చేసి క్షమించమని అడగడం వల్ల ఎంత కోపంలో ఉన్నవాళ్లైనా ఈజీగా కరిగిపోతారు.
గిఫ్ట్ తో మూడ్ ఛేంజ్
చాలామందికి బహుమతులంటే బాగా ఇష్టం ఉంటుంది. కోపంలో ఉన్నవాళ్లని కూల్ చేయాలంటే వాళ్లకి ఇష్టమైనవాటిని బహుమతు లుగా ఇవ్వాలి. ఆ బహుమతులపై 'సారీ' అని రాసి ఇవ్వడంతో పార్ట్నర్ ఇంకాస్త తొందరగా కూల్ అయ్యే అవకాశం ఉంది.
