Vastu Tips: దీపావళి పండుగకు ఇంటిని శుభ్రం చేస్తున్నారా.. ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు..!

Vastu Tips: దీపావళి  పండుగకు ఇంటిని శుభ్రం చేస్తున్నారా.. ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు..!

 పండుగ వచ్చినా.. పబ్బం వచ్చినా.. ముందుగా ఇంటిని క్లీన్ చేస్తాము. అడ్డుగా ఉన్నటువంటి ఆ సమయంలో వాడని వస్తువులను  ఎవ్వరికి కనపడకుండా సర్దుకుంటాం. ఇలా చేసేటప్పుడు   వాస్తు  ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం, ఈశాన్య మూల, పూజ గది విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.  అలాగే దీపావళి పండుగ సమయంలో కేదారీశ్వర వ్రతం..  లక్ష్మీదేవి పూజ చేయడానికి వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

దీపావళి పండుగ సమయం దగ్గర పడుతుంది.  హిందువులు ఇళ్లను శుభ్రంచేసేందుకు జనాలు రడీ అవుతున్నారు.  రంగురంగుల ముగ్గులు, పూలతోరణాలు, దీపాలతో అందంగా అలంకరిస్తారు. అలా చేసే విషయంలో వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు, అలంకరించేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం, ఈశాన్య మూల, పూజ గది విషయంలో  వాస్తు సిద్దాంతం ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. 

ఇంటి ప్రధాన ద్వారం విషయంలో:  వాస్తుప్రకారం.. జ్యోతిష్య సిద్దాంతం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.  సాధారణంగా దీపావళి పండుగ సమయంలో ఇంటి గుమ్మం దగ్గర దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మిని ఇంటిలోకి ఆహ్వానిస్తారు. అందుకే ఇంటి గుమ్మం దగ్గర చాలా శుభ్రంగా ఉండాలి.  గోమయంతో శుద్ది చేయాలి. 

ముఖ్యంగా  ద్వారం ముందు బూట్లు, చెప్పులు, చెత్తాచెదారం అస్సలు ఉండకూడదు. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అవకాశాన్ని బట్టి  బంతిపూల దండలు, పూలతోరణాలను అందంగా అలంకరించాలి.ప్రధాన ద్వారం దగ్గర  మామిడి ఆకుల తోరణం కట్టాలి.  గుమ్మం ముందు రంగులతో సంప్రదాయంగా స్వస్తిక చిహ్నాన్ని కాని.. శ్రీ విష్ణు పాదాలు కాని  వేయాలి. 

ఇంటి ఈశాన్య మూల:  వాస్తు సిద్దాంతం ప్రకారం ఇంటి ఈశాన్య దిక్కుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది.  ఈ దిశలో పూజ, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటారు.  కాబట్టి అందువల్ల దీపావళికి ముందు ఇంటి ఈశాన్య మూలను పూర్తిగా శుభ్రం చేసుకోవడం మంచిది.అక్కడ కిటికీలు ఉంటే బూజు దులుపుకోవడం..  పసుపు నీటితో శుభ్రం చేయడం.. గోమయంతో శుద్ది చేసి.. శుభ్రంగా కడిగిన మందిరాన్ని ఆ ప్రదేశంలో ప్రతిష్టించుకోవడం చేయాలి.  

దేవుడి పటాలను  శుభ్రపరిచి.. అందంగా అలంకరించుకోవాలి. ఈ ప్రాంతంలో పాత వస్తువులు, విరిగిన సామాన్లు, పనికిరాని వస్తువులను ఎట్టి పరిస్థితిలో ఉంచకూడదు. చెత్తాచెదారం పేరుకుపోకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈశాన్య మూలలో శుభ్రతను పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.

పూజ గది: హిందువులు దీపావళి పండుగకు వినాయకుడిని.. లక్ష్మీదేవిని పూజిస్తారు.  ఈ పండుగకు ముందే పూజా గదిని శుభ్రం చేసుకోవాలి.  దీపావళి రోజు మందిరాన్ని పూలతో అలంకరిచుకోవాలి. చాలామంది కేదారీశ్వర వ్రతం చేసుకుంటారు. లక్ష్మీదేవిని ఘనంగా పూజిస్తారు.అలాగే, పూజకు అవసరమైన వస్తువులను క్రమబద్ధంగా అమర్చుకోవడం వల్ల ఇల్లు మరింత అందంగా కనిపిస్తుంది.

పూజా పీఠంపై శుభ్రమైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి, దానిపై దేవతా విగ్రహాలను ఉంచి పూజ చేసుకోవాలి. పూజకు అవసరమైన పూలు, పండ్లు, అక్షింతలు, కుంకుమ, దీపాలు వంటి వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. పూజ ప్రదేశం చాలా శుభ్రంగా ఉండాలి. ఎలాంటి పనికిరాని..ఉపయోగించని వస్తువులు ఉండకూడదు.  దీపారాధన ప్రమిదలను అందంగా అలంకరించుకోవాలి. వాస్తు సంప్రదాయాల ప్రకారం పూజా విగ్రహాలను ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు

దీపావళి రోజున లక్ష్మీదేవి, గణేశుడిని ప్రత్యేకంగా పూజించడం ఆనవాయితీ. లక్ష్మీదేవిని సంపద, శ్రేయస్సు, సమృద్ధికి ప్రతీకగా భావిస్తే.. గణేశుడిని విఘ్నాలను తొలగించే దేవుడిగా, శుభకార్యాలకు అధిపతిగా పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు తమ కుటుంబంలో సుఖసంతోషాలు, ఆర్థిక అభివృద్ధి, జ్ఞానం, వివేకం కలగాలని ప్రార్థిస్తారు.  సంపదకు అధిపతిగా భావించే కుబేరుడిని కూడా పూజిస్తారు. వ్యాపారులు కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభించి, తమ వ్యాపారాలు అభివృద్ధి చెందాలని దైవ ఆశీస్సులు కోరుకుంటారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో వాస్తు పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.