మెదక్ జిల్లా లో ఒకే కరువు మండలమా..ఒక్క మనోహరాబాద్‌‌‌‌కే చోటు

మెదక్ జిల్లా లో ఒకే కరువు మండలమా..ఒక్క మనోహరాబాద్‌‌‌‌కే చోటు
  • అన్యాయమని.. అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు 

మెదక్, వెలుగు: ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. జిల్లాల వారీగా ఎన్ని మండలాల్లో కరువు నెలకొందనే జాబితా విడుదల చేసింది. 

ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి జిల్లాలో 28, సిద్దిపేట జిల్లాలో 8 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించగా, మెదక్ జిల్లాలో మాత్రం కేవలం ఒకే మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించడంపై ప్రజలు, రైతుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

అంతేగాక పంటల సాగు తక్కువగా ఉండి, పారిశ్రామిక ప్రాంతమైన మనోహరాబాద్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో పంటల సాగు, వర్షలోటును పరిగణలోకి తీసుకుని కరువు మండలాలను గుర్తించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

జిల్లాలో పంటలు ఎక్కువ విస్తీర్ణంలోనే సాగైనప్పటికి వర్షాభావ పరిస్థితుల కారణంగా, కరెంట్ కోతల వల్ల బోర్ల ద్వారా నీటి తడులు అందక చాలా మండలాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిని రైతులు నష్ట పోయారని, చాలా మండలాల్లో యాసంగిలో పంటలు సాగు చేసే పరిస్థితి లేదని, తద్వారా రైతు కూలీలకు ఉపాధి కరువయ్యే పరిస్థితి ఉందని మెదక్ సిటిజన్​ ఫోరం అధ్యక్షుడు కొండల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 

అధికారులు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వానికి సరైన నివేదకలు పంపక పోవడంతో కరువు మండలాల గుర్తింపులో మెదక్ జిల్లాకు అన్యాయం జరిగిందన్నారు. జిల్లాలో ఆరు మండలాల్లో వర్ష లోటు ఉందని ఆయన తెలిపారు. అందువల్ల ప్రభుత్వం జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై రీ సర్వే చేసి మరిన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.