హైదరాబాద్ సిటీలో  ఐదు స్వీట్ షాపులు మూసివేత..ఏడు షాపులకు షోకాజ్ నోటీసులు

హైదరాబాద్ సిటీలో  ఐదు స్వీట్  షాపులు మూసివేత..ఏడు షాపులకు షోకాజ్ నోటీసులు

లైసెన్సులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్న స్వీట్ తయారీ సంస్థలపై టీజీ సేఫ్, హైదరాబాద్ సిటీ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. మొత్తం 13 స్పెషల్ టీములు గ్రేటర్ పరిధిలోని 16 స్వీట్ తయారీ, రిటైల్ యూనిట్లలో తనిఖీలు చేపట్టాయి. కనీస నిబంధనలు పాటించని ఐదు సంస్థలను అధికారులు మూసివేయించారు. మరో ఐదు సంస్థల ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేస్తూ వ్యాపార కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. 

ఎలాంటి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా అపరిశుభ్రంగా నిర్వహిస్తున్న చంపాపేట్ బాలాజీ స్వీట్ హౌస్, సికింద్రాబాద్ పీజీ రోడ్డులోని మమతా స్వీట్ హౌస్, లక్ష్మీగూడలోని ఎస్‌‌కే ఫుడ్స్, ఎంజే మార్కెట్ హమీదీ కన్ఫెక్షనరీస్, చూడీ బజార్ అన్నపూర్ణ క్యాటరర్స్‌‌ను అధికారులు పూర్తిగా మూసివేయించారు. మరోవైపు సనత్‌‌నగర్‌‌లోని జీ పుల్లా రెడ్డి స్వీట్స్ తయారీ కేంద్రంలో కుళ్లిన కూరగాయలు, ఎలుకల రెట్టలు, గడువు ముగిసిన నిల్వలను గుర్తించి అక్కడే రూ. 15,03,582 విలువైన 3,133 కిలోల స్టాక్‌‌ను అధికారులు సీజ్ చేశారు. అలాగే, చార్మినార్ అగ్రా మిఠాయి ఘర్ రెస్టారెంట్, వనస్థలిపురం స్వీటోన్ రుచులు, షంషీర్‌‌గంజ్ బాలాజీ శ్రీకిషన్ మిఠాయి భండార్, కాటేదాన్‌‌లోని హిరానీ ఫుడ్స్ (మినర్వా స్వీట్స్) లైసెన్సులను సస్పెండ్ చేసి కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు. 

ఏడు సంస్థలకు షోకాజ్ నోటీసులు

సనత్‌‌నగర్‌‌ భరత్ బక్లావా, తిమ్మాపూర్‌‌ కరాచీ బేకరీ ఇంటర్నేషనల్ సహా ఇప్పటికే మూసివేసిన ఐదు సంస్థలతో కలిపి మొత్తం ఏడు యూనిట్లకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సరైన లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నందుకు వీరిపై జరిమానాలు విధించే చర్యలు చేపట్టారు. మరోవైపు హిమాయత్‌‌నగర్‌‌లోని శ్రీ శగున్ మిఠాయి వాటికాలో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశిస్తూ ఇంప్రూవ్‌‌మెంట్ నోటీసు అందజేశారు. లోపాలు సరిదిద్దిన తర్వాతే మళ్లీ తనిఖీ చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. 

కాటేదాన్‌‌ ఎస్‌‌కే ఫుడ్స్‌‌లో అక్రమ లేబులింగ్‌‌

తనిఖీల్లో కల్తీ అనుమానంతో 22  ఫుడ్ శాంపిల్స్ ను సేకరించిన అధికారులు..రూల్స్​కు విరుద్ధంగా ఉన్న సుమారు రూ. 16,86,018 విలువైన 3,546.5 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేసి ధ్వంసం చేశారు. డ్రైనేజీ లీకేజీలు, మురికి కాల్వలు, తుప్పు పట్టిన మెషీన్ల నడుమ స్వీట్లు తయారు చేస్తుండటం గుర్తించారు. ఈగలు, ఎలుకలు, బొద్దింకల బెడదతో పాటు పలు చోట్ల ఎలుక రెట్టలు, కుళ్లిన కూరగాయలను నిల్వ ఉంచినట్లు తేలింది. స్వీట్లపై పాత న్యూస్ పేపర్లు కప్పడం, గడువు ముగిసిన ముడిసరుకును వాడటం కనిపించింది. కాటేదాన్‌‌ లోని ఎస్‌‌కే ఫుడ్స్‌‌లో ప్యాక్ చేసిన స్వీట్లపై ఏకంగా భవిష్యత్ తయారీ తేదీలతో (31.10.2026) లేబుల్స్ ప్రింట్ చేసి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.