చైనా అంతరిక్ష విమానం.. 20 ఏళ్లుగా రహస్యంగా ఆకాశంలోనే.. తొలిసారి ఫొటో విడుదల !

 చైనా  అంతరిక్ష విమానం.. 20 ఏళ్లుగా రహస్యంగా ఆకాశంలోనే.. తొలిసారి ఫొటో విడుదల !

చైనా రహస్యంగా అభివృద్ధి చేస్తున్న అంతరిక్ష విమానం ‘షెన్‌లాంగ్’కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫొటో తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా రక్షణ నిఘా సంస్థ (DIA)  ఒక రిపోర్టులో ఈ ఫోటోని ప్రచురించింది. ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులో ఉన్న ఫొటోల్లో ఇదే అత్యంత స్పష్టమైనదిగా భావిస్తున్నారు. ఇందులో విమానం కింది భాగంతో పాటు, వెనుకవైపు ఉన్న సోలార్ ప్లేట్స్   కూడా కనిపిస్తున్నాయి.

జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ మాక్సర్ టెక్నాలజీస్ 2024లో ఈ ఫొటోను తీసింది. అంతరిక్షంలో అమెరికా ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్ల గురించి DIA విడుదల చేసిన రిపోర్టులో దీనిని చేర్చారు.

అంతరిక్షంలో పెరుగుతున్న ప్రమాదాలు  
DIA విడుదల చేసిన 130 పేజీల రిపోర్టులో అమెరికాతో పాటు ఇతర దేశాలు అంతరిక్షంలో ఎదుర్కొంటున్న ముప్పుల గురించి వివరించారు. ముఖ్యంగా అంతరిక్ష వ్యర్థాలు పెద్ద సమస్యగా మారుతున్నాయని రిపోర్టు  పేర్కొంది.

పనికిరాని ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకల నుంచి విడిపోయిన ముక్కలు భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతూ ఉంటాయి. వీటినే అంతరిక్ష వ్యర్థాలు అంటారు. ఇవి ఇతర ఉపగ్రహాలను ఢీకొంటే భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది.

ఒకటి ఢీకొనడం వల్ల మరిన్ని ముక్కలు ఏర్పడి, అవి ఇతర ఉపగ్రహాలను ఢీకొనే పరిస్థితి రావచ్చు. ఇలా వరుసగా ప్రమాదాలు జరిగే పరిస్థితిని ‘కెస్లర్ సిండ్రోమ్’ అంటారు. దీనివల్ల అంతరిక్షంలో ఉపగ్రహాల నిర్వహణ మరింత కష్టమయ్యే అవకాశం ఉంది. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు అంతరిక్ష రంగంలో సాధిస్తున్న పురోగతిని కూడా ఈ రిపోర్టు  ప్రస్తావించింది.

దాదాపు 20 ఏళ్లుగా రహస్యంగానే  
చైనాకు చెందిన షెన్‌లాంగ్ అంతరిక్ష విమానం గురించి చాలా ఏళ్లుగా చర్చ జరుగుతున్నప్పటికీ, దాని అసలు లక్ష్యాలు, సామర్థ్యాలపై పూర్తి వివరాలు బయటకు రాలేదు. ఈ ప్రాజెక్టు దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ అంతరిక్ష విమానానికి సంబంధించిన ప్రయోగాలు ఇప్పటికే పలుమార్లు జరిగాయి.

2020లో: తొలి కక్ష్య ప్రయోగం రెండు రోజుల పాటు కొనసాగింది.
2022లో: రెండో ప్రయోగంలో ఈ విమానం 276 రోజుల పాటు అంతరిక్షంలో ఉంది.
2023లో: మూడో ప్రయోగంలో 268 రోజుల పాటు కక్ష్యలో కొనసాగింది.

మాక్సర్ టెక్నాలజీస్ తీసిన ఫొటో 2023 మిషన్‌కు సంబంధించినదై ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ ఫోటో తీసిన ఖచ్చితమైన టైం, సందర్భంపై పూర్తి వివరాలు లేవు.

కక్ష్యలోకి గుర్తుతెలియని వస్తువు.. అసలు ఏంటది?
షెన్‌లాంగ్ గురించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. 2023లో జరిగిన మిషన్ సమయంలో ఈ అంతరిక్ష విమానం కక్ష్యలోకి ఒక గుర్తుతెలియని వస్తువును విడుదల చేసినట్లు DIA రిపోర్టులో వెల్లడించింది.

అయితే, ఆ వస్తువు ఏంటి ? దాని ఉపయోగం ఏంటి? అది ఉపగ్రహమా, పరిశోధన పరికరమా? అనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. చైనా ఈ అంతరిక్ష విమానంతో ఎలాంటి ప్రయోగాలు చేస్తోందనే దానిపై కూడా కొంత సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. ఇక షెన్‌లాంగ్  నాలుగో ప్రయోగ యాత్రను 2026 ఫిబ్రవరి 7న చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ప్రారంభించినట్లు   తెలుస్తుంది. 

అమెరికా దగ్గర కూడా  
చైనా మాత్రమే కాదు.. అమెరికా కూడా ఇలాంటి అంతరిక్ష విమానాన్ని అభివృద్ధి చేసింది. బోయింగ్ సంస్థ రూపొందించిన ‘ఎక్స్-37బి’ (X-37B) అమెరికా అంతరిక్ష కార్యక్రమంలో కీలకమైన వాహనం.

ఈ విమానం  ఎనిమిదో మిషన్‌లో ఏకంగా 431 రోజుల పాటు భూమికి సమీప కక్ష్యలో గడిపింది. అంతరిక్షంలో విద్యుత్ ఉత్పత్తి కోసం ఇందులో గాలియం ఆర్సెనైడ్ సోలార్ ప్లేట్స్  ఉపయోగిస్తారు.

ఎక్స్-37బి ప్రత్యేకత ఏమిటంటే, ఇది రాకెట్ సాయంతో నిలువుగా అంతరిక్షంలోకి వెళ్తుంది. తిరిగి భూమికి వచ్చినప్పుడు విమానంలా అడ్డంగా రన్‌వేపై ల్యాండ్ అవుతుంది.

ఈ విమానం 29 అడుగులకు పైగా పొడవు, సుమారు 15 అడుగుల రెక్కల వెడల్పు  ఉంటుంది. గంటకు దాదాపు 28,044 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

అంతరిక్షంలో ఆధిపత్యం కోసం  
ప్రస్తుతం అంతరిక్షం కేవలం పరిశోధనలకే పరిమితం కావడం లేదు. ఉపగ్రహాల నిర్వహణ, నిఘా, రక్షణ వంటి అంశాల్లోనూ కీలకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చైనా షెన్‌లాంగ్, అమెరికా ఎక్స్-37బి వంటి అంతరిక్ష విమానాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అయితే, షెన్‌లాంగ్ అసలు లక్ష్యం ఏంటి ? అది కక్ష్యలోకి విడుదల చేసిన వస్తువు దేనికి సంబంధించినది ? ఈ విమానం భవిష్యత్తులో ఎలాంటి ప్రయోగాలు చేయనుంది? అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానాలు లేవు. తాజాగా విడుదలైన ఫొటో మాత్రం ఈ రహస్య అంతరిక్ష విమానంపై ఆసక్తిని మరింత పెంచింది.