దేశీయ బ్యాంకింగ్ రంగంలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అనేక మోసాలకు అడ్డాగా మారిన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగిన మరో కుంభకోణం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. దేశాన్ని కుదిపేసిన గత కుంభకోణాల జ్ఞాపకాలను ఇది గుర్తు చేస్తోంది. గ్రేటర్ నోయిడాలోని ఓ పీఎన్‌బీ శాఖలోని అకౌంట్లలో రూ.35 కోట్ల వరకు డబ్బు మాయమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్సెడ్ డిపాజిట్ల నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే డబ్బులు ఖాళీ కావడంతో అకౌంట్ హోల్డర్లు లబోదిబోమంటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని సెక్టర్ పై-1లో ఉన్న పీఎన్‌బీ బ్రాంచ్‌లో ఈ భారీ అవకతవకలు బయటపడ్డాయి. ఖాతాదారుల ప్రమేయం లేకుండానే వారి అకౌంట్ల నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్ కావడం, ఎఫ్‌డీలను ప్రీ-మెచ్యూర్ క్లోజ్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తమ కష్టార్జితం ఒక్కసారిగా ఆవిరైపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఎలాంటి మెసేజ్ లేకుండానే..
ఈ మోసంలో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఖాతాల నుంచి భారీగా డబ్బులు డ్రా అవుతున్నా, ఎవరికీ ఎలాంటి SMS అలర్ట్ అందకపోవటమే. విజేంద్ర సింగ్ అనే వ్యక్తి సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ రూ.88 లక్షల నుంచి రూ. లక్షకు పడిపోయింది. అలాగే హనీఫ్ ఖాన్ అనే మరో కస్టమర్ అకౌంట్లో ఉన్న రూ. 39 లక్షలు పూర్తిగా మాయమయ్యాయి. తనకు ఎలాంటి మెసేజ్ రాలేదని, తాను ఎక్కడా సంతకాలు కూడా చేయలేదని బాధిక కస్టమర్ వాపోయారు. అలాగే జాకిర్ అనే మరో కస్టమర్ ఖాతా నుంచి రూ. 9 లక్షల 50వేలు మాయమైనట్లు గుర్తించారు. కస్టమర్లు తమ పాస్‌బుక్‌లు అప్‌డేట్ చేయడానికి వెళ్లినప్పుడు.. ఆర్‌బీఐ ఆడిట్ జరుగుతోందని చెప్పి బ్యాంకు సిబ్బంది కాలయాపన చేశారని, ఈ కారణంగానే మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
బ్యాంక్ స్పందన..
ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో రంగంలోకి దిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టింది. బ్రాంచ్ మేనేజర్‌తో సహా మొత్తం 5 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసి, ఆ బ్రాంచ్ సిబ్బందిని పూర్తిగా మార్చేశారు. డబ్బులు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదు మేరకు బీటా-2 పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు 18 మంది బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసు తీవ్రతను బట్టి దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేసే అవకాశం ఉంది. పీఎన్‌బీ యాంటీ కరప్షన్ టీమ్ కూడా దీనిపై అంతర్గత విచారణ జరుపుతోంది. ఖాతాదారుల డబ్బును సురక్షితంగా రికవరీ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు, ఖాతాదారులు బ్యాంకు ఎదుట నిరసనలు చేస్తున్నారు.
