మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ' పెద్ది ' సినిమా చుట్టూ నెలకొన్న వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో తన పాత్ర చిత్రీకరణపై తొలిసారి బహిరంగంగా స్పందించారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని, ఈ అనుభవం ఒకరకంగా తనకు బాధను కలిగించిందని వెల్లడించింది. షూటింగ్ సమయంలోనే మరింత గట్టిగా తాను ప్రశ్నించి ఉండాల్సిందని అంగీకరించింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
నేను ఇంకా గట్టిగా మాట్లాడాల్సింది..
లేటెస్ట్ గా కరణ్ జోహార్ హోస్ట్ గా చేస్తున్న 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' జాన్వీ కపూర్ పాల్గొంది. ఈ సందర్భంగా 'పెద్ది' మూవీలోని అచ్చియమ్మ పాత్ర చుట్టూ రేగిన వివాదంపై తన మనసులోని మాటను బయటపెట్టింది. సినిమాలో తన పాత్రను చూపించిన విధానంపై ప్రేక్షకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా కెమెరా యాంగిల్స్, కొన్ని సన్నివేశాలు మహిళలను కేవలం గ్లామర్‌కే పరిమితం చేస్తున్నాయనే విమర్శలు వచ్చాయి.
ఆ సన్నివేశాలు సమస్యాత్మకంగా ఉన్నాయా? మహిళను అతిగా ఆబ్జెక్టిఫై చేశాయా? లైంగిక దాడిని సమర్థించేలా కథనం ఉందా? అన్న కరణ్ ప్రశ్నలకు అవును అంటూ జాన్వీ సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను ఇంకా అప్రమత్తంగా ఉండాల్సింది. మరింత గట్టిగా అభ్యంతరం చెప్పాల్సింది అని చెప్పుకొచ్చింది.
మనసులోని అసౌకర్యాన్ని చెప్పాలా?
షూటింగ్ సమయంలో దర్శకుడు చెప్పినట్లు ప్రొఫెషనల్‌గా పనిచేయాలనే ఒత్తిడి ఉంటుందని జాన్వీ వివరించింది. దక్షిణాది సినిమాల్లో ప్రతి కెమెరా యాంగిల్ ముందుగానే స్క్రిప్ట్‌లో స్పష్టంగా ఉండకపోవచ్చని చెప్పింది. అయితే, పరిశ్రమలో తనకున్న ప్రత్యేక స్థాయిని ఉపయోగించుకుని మరింత గట్టిగా ప్రశ్నించి ఉండాల్సిందని అంగీకరించింది. ఇది నన్ను ఒక రకంగా బాధించిన అనుభవం అని చెబుతూ, తనను తాను బాధితురాలిగా చూపించుకోవడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేసింది.
దర్శకుడు క్షమాపణ..
అయితే 'పెద్ది' రిలీజ్ తర్వాత జాన్వీ పాత్రపై విమర్శలు రావడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. వివాదాస్పద భాగాల్లో మార్పులు చేశారు. ఇప్పుడు జాన్వీ వ్యాఖ్యలు మరోసారి మహిళా పాత్రల చిత్రీకరణ, నటీనటుల అంగీకారం, సెట్స్‌పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చకు తెరలేపాయి. ఈ వివాదం వల్ల భవిష్యత్తులో మరో హీరోయిన్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోకుండా ఉంటే అదే తనకు సంతోషమని జాన్వీ తెలిపింది.
