నీరజ్ యాదవ్ మరణానికి ముందు ఏం జరిగింది ? చివరిసారిగా కలిసిన మహిళ ఏం చెప్పింది?

 నీరజ్ యాదవ్ మరణానికి ముందు ఏం జరిగింది ? చివరిసారిగా కలిసిన మహిళ ఏం చెప్పింది?

మూడుసార్లు ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన భారత పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ మరణం క్రీడా ప్రపంచంలో విషాదాన్ని నింపింది. సోమవారం రాత్రి ఢిల్లీలోని మౌజ్‌పూర్ మెట్రో స్టేషన్ సమీపంలో తన కారులో ఆయన అపస్మారక స్థితిలో కనిపించారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు  ఆయన అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. ఆయన వయసు 42 సంవత్సరాలు.

డిస్కస్ త్రో, జావెలిన్ త్రో విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన నీరజ్.. హర్యానాలోని సోనిపట్‌లో ఒక స్పోర్ట్స్ అకాడమీని కూడా నడుపుతున్నాడు. ఆయన మరణానికి  కారణాలు, ఘటనకు ముందు ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదట ఇది ఆత్మహత్య అయి ఉండొచ్చని అనుమానించిన.. అసలు ఏం జరిగిందనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

నీరజ్‌ను చివరిసారిగా కలిసిన మహిళ  
సమాచారం ప్రకారం.. నీరజ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన మహిళకు ఆయన 2025 డిసెంబర్ నుంచి పరిచయం ఉంది. పోలీసులకు ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అక్టోబర్ 27న నీరజ్‌ను కలవడానికి తాను సోనిపట్‌కు వెళ్లినట్లు ఆమె పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఇకపై ఆయనతో సంబంధాన్ని కొనసాగించలేనని ఆమె నీరజ్‌తో చెప్పినట్లు సమాచారం.

ఆ తర్వాత నీరజ్ తన కారులో ఆమెను మౌజ్‌పూర్‌లో దింపినట్లు ఆమె తెలిపిందని వార్తాలు  వచ్చాయి. అదే రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆమె మళ్లీ మౌజ్‌పూర్ మెట్రో స్టేషన్‌లోని గేట్ నంబర్ 1 దగ్గరికి  వెళ్లినట్లు సమాచారం. అక్కడ నీరజ్ తన కారు దగ్గర రోడ్డుపై పడి ఉండటాన్ని చూసిన ఆమె, వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే, ఇవన్నీ ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వెలుగులోకి వచ్చిన వివరాలు మాత్రమే. ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

నీరజ్ యాదవ్ కుటుంబం  
నీరజ్ మరణంతో ఆయన కుటుంబికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నీరజ్ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, వాటిని అధిగమించి క్రీడల్లో కొనసాగారని.. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరణించడం తమకు నమ్మశక్యంగా లేదని  కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

చిన్నప్పటి నుంచే కష్టాలు.. 
నీరజ్ యాదవ్ జీవితం ఎన్నో సవాళ్లతో సాగింది. ఆయనకు ఏడేళ్ల వయసులో పోలియో కారణంగా పక్షవాతం వచ్చినట్లు నిర్ధారణ అయింది. అయినప్పటికీ, ఆయన క్రీడలపై ఆసక్తిని వదులుకోలేదు. మొదట వీల్‌చైర్ టేబుల్ టెన్నిస్ ఆడిన నీరజ్, 2015లో అథ్లెటిక్స్ వైపు అడుగులు వేశారు. ఆ తర్వాత పారా-అథ్లెటిక్స్‌లోని F55 విభాగంలో పోటీపడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

2022 ఆసియా పారా గేమ్స్‌లో జావెలిన్ త్రో, డిస్కస్ త్రో విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. మొత్తం మూడుసార్లు ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన అథ్లెట్‌గా ఆయన గుర్తింపు పొందారు. శారీరక ఇబ్బందులు ఉన్న... కష్టపడి సాధన చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించడం ఆయన పట్టుదలకు నిదర్శనం. ఆయన ప్రయాణం ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచింది.

 వ్యక్తిగత జీవితం
క్రీడలతో పాటు నీరజ్ కుటుంబ జీవితాన్ని కూడా కొనసాగించారు.  సమాచారం ప్రకారం, ఆయనకు 2018లో వివాహమైంది. ఆయనకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. హర్యానాలోని సోనిపట్‌లో స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తూ క్రీడలకు తన వంతు సేవలు అందించారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడా రంగానికి చెందినవారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

అసలు ఏం జరిగింది?  
చాలా కష్టాలను అధిగమించి క్రీడల్లో గొప్ప విజయాలు సాధించిన నీరజ్ యాదవ్ ఆకస్మిక మరణం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆయన చివరిసారిగా కలిసిన మహిళ ఇచ్చిన వాంగ్మూలం, కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, ఘటనకు ముందు జరిగిన పరిణామాలు.. ఇలా అన్ని అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

అయితే, ఇప్పటివరకు బయటకు వచ్చిన వివరాల ఆధారంగా  మరణానికి గల కారణాన్ని నిర్ధారించలేం. పోలీసుల దర్యాప్తు పూర్తయి, అధికారికంగా వెల్లడించే వివరాల ద్వారానే అసలు ఏం జరిగిందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.