IPL 2027కు ముందు బిగ్ ట్విస్ట్: లసిత్ మలింగను తప్పించిన ముంబై ఇండియన్స్

IPL 2027కు ముందు బిగ్ ట్విస్ట్: లసిత్ మలింగను తప్పించిన ముంబై ఇండియన్స్

Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీ, తమ కోచింగ్ బృందంలో సంచలన మార్పులు చేపడుతున్నట్లు ఈరోజు (అక్టోబర్ 29, గురువారం) అధికారికంగా ప్రకటించింది. హెడ్ కోచ్‌గా మహేల జయవర్ధనే స్థానంలో కీరన్ పొలార్డ్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే.. బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ, అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్‌కిన్‌సన్‌లు జట్టును వీడుతున్నట్లు ప్రకటించారు. కాగా ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ (Lasith Malinga) నిష్క్రమణతో ఫ్రాంచైజీ చరిత్రలో ఒక ఐకానిక్ శకం ముగిసినట్లైంది. 

కోచ్‌గా మలింగ సుదీర్ఘ ప్రయాణం:

* ముంబై ఇండియన్స్ నాలుగు ఐపీఎల్ టైటిళ్లు సాధించడంలోనూ, 2011 ఛాంపియన్స్ లీగ్ టీ20 గెలవడంలోనూ మలింగ కీలక పాత్ర పోషించాడు. 

* ప్లేయర్ టూ మెంటార్‌: ఆటగాడిగా వీడ్కోలు పలికిన తర్వాత 2018 సీజన్‌లో ముంబై జట్టుకు మెంటార్‌గా వ్యవహరించాడు.

* బౌలింగ్ కోచ్‌గా: రెండేళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా పని చేసిన మలింగ.. తొమ్మిదేళ్ల పాటు ముంబై ఇండియన్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉన్న షేన్ బాండ్ స్థానంలో 2024 సీజన్‌కు ముందు బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

వైదొలగనున్న పరాస్ మాంబ్రే, హాప్‌కిన్‌సన్: 

* పరాస్ మాంబ్రే (Paras Mhambrey): రెండు విడతల్లో ముంజై ఇండియన్స్ జట్టుకి సేవలు అందించిన మాంబ్రే, నవంబర్ 2021 నుంచి జులై 2024 వరకు టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఉండి భారతదేశం టీ20 ప్రపంచకప్ గెలవడంలో ముఖ్యపాత్ర పోషించాడు.

* కార్ల్ హాప్‌కిన్‌సన్ (Carl Hopkinson): ఇంగ్లాండ్ మాజీ ఫీల్డింగ్ కోచ్ అయిన హాప్‌కిన్‌సన్ 2025 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా చేరి సేవలందించాడు.

ముంబై ఇండియన్స్ అధికారిక ప్రకటన: 

జట్టుకు, ముంబై ఇండియన్స్ కుటుంబానికి లసిత్ మలింగ, పరాస్ మాంబ్రే, కార్ల్ హాప్‌కిన్‌సన్‌లు అందించిన అసాధారణ సేవలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.. వారి భవిష్యత్ ప్రయత్నాల్లో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నామని ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ మార్పులతో ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై కీరన్ పొలార్డ్ నేతృత్వంలో సరికొత్త సహాయక బృందంతో (Support Staff) మైదానంలోకి దిగబోతుంది.