రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు రూ.4 కోట్ల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ

రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు రూ.4 కోట్ల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ

ఉద్యోగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిస్తే బాస్‌లు ప్రశంసిస్తారు.. కొన్నిసార్లు బోనస్‌లు ఇస్తారు. కానీ దుబాయ్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ మాత్రం తన టాప్ ఎంప్లాయ్‌కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా రూ.4 కోట్ల విలువ చేసే లగ్జరీ కారును కానుకగా ప్రకటించి ట్రెండింగ్‌లో నిలిచింది. 

దుబాయ్‌కి చెందిన 'రిచ్‌కీ ప్రాపర్టీస్' అనే రియల్ ఎస్టేట్ సంస్థ తన 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో ఆ సంస్థలో పనిచేస్తున్న నటాలియా చావెజ్ అనే ఉద్యోగిని అద్భుత ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. గత రెండేళ్లలో ఏకంగా 500 మిలియన్ డాలర్లకు పైగా ప్రాపర్టీ సేల్స్ చేసి రికార్డు సృష్టించింది. కేవలం 9 నెలల్లోనే కంపెనీలో టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచింది. ఆమె సేవలను గుర్తించిన కంపెనీ యాజమాన్యం భారీ సర్ప్రైజ్ ఇచ్చింది.

వేదికపై ఆమెను సత్కరించిన అనంతరం ఓ పెద్ద గిఫ్ట్ బాక్స్‌ను అన్‌బాక్స్ చేయించారు. అందులో పెద్ద బొమ్మ రిబ్బన్‌తో అలంకరించిన సరికొత్త 'లంబోర్గిని ఉరుస్' లగ్జరీ కారు ప్రత్యక్షమైంది. అది చూసి నటాలియా ఆశ్చర్యపోయారు. దుబాయ్ మార్కెట్లో ఈ లంబోర్గిని కారు ధర సుమారు రూ. రూ. 4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ ఖరీదైన గిఫ్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

దీనిపై రెడిట్ వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో సంపాదన విపరీతంగా ఉంటుందని, అందుకే అందరూ ఈ రంగం వైపు వస్తున్నారని కొందరు కామెంట్లు చేశారు. అయితే సాఫ్ట్‌వేర్ వంటి ఇతర రంగాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్ చాలా కష్టమని, నెలల తరబడి జీతం లేకుండా బ్రోకర్లు కష్టపడాల్సి వస్తుందని మరికొందరు చెబుతున్నారు. 500 మిలియన్ల సేల్స్ సాధించడం సాధారణ విషయం కాదని, ఆమె పడ్డ కష్టానికి తగిన ఫలితమే ఈ లంబోర్గిని అని మరికొందరు కొనియాడారు. ఏదేమైనా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ గిఫ్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.