నిజం నిలకడ మీదే తేలుతది: కొండా సురేఖ క్షమాపణలపై స్పందించిన KTR

నిజం నిలకడ మీదే తేలుతది: కొండా సురేఖ క్షమాపణలపై స్పందించిన KTR

హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ క్షమాపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గురువారం (అక్టోబర్ 29) ఆయన తెలంగాణ భవన్‎లో మీడియాతో మాట్లాడుతూ.. నిజం నిలకడ మీదే తేలుతుందని అన్నారు. మొన్న ఒక వార్తాపత్రిక క్షమాపణ చెప్పింది.. కొండా సురేఖ క్షమాపణ చెప్పారని అన్నారు. 
ఇంకా క్షమాపణలు చెప్పే వాళ్లు చాలా మంది ముందు వరుసలో ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా మీద ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేసే వారు భవిష్యత్తులో వరుసగా క్షమాపణలు చెప్తారని పేర్కొన్నారు. 

కేటీఆర్‎కు కొండా సురేఖ క్షమాపణ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‎పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశానని, అయితే అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని అన్నారు.

గతంలో తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు నిరాధారమైనవని, అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. కేటీఆర్ను లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. అలాగే వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం కూడా తనకు లేదని తెలిపారు.

తన వ్యాఖ్యల వల్ల కేటీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురై ఉంటే అందుకు చింతిస్తున్నట్లు కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. కేటీఆర్‎పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో కొండా సురేఖ ఇచ్చిన ఈ వివరణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.