పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా 37 చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించింది పోలీస్ శాఖ. గురువారం ( అక్టోబర్ 29 ) జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని జోన్లకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన రక్తదాన శిబిరంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బంది, వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు, పీస్ కమిటీ సభ్యులు, రాజకీయ నాయకులూ, యువకులు భారీగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సికింద్రాబాద్ డీసీపీ రక్షితమూర్తి మాట్లాడుతూ.. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. రక్తదానం మహాదానం అని, .ఆపద సమయంలో ప్రాణదానంగా ఈ రక్తదానం ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు.
సికింద్రాబాద్ జోన్ లో నాలుగు చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని, పేదవారికి ఉపయోగపడే విధంగా సేకరించిన బ్లడ్ ను బ్లడ్ బ్యాంక్ లకు అందిస్తామని తెలిపారు. ఈ రక్త దానం తో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి అందిస్తున్నామని తెలిపారు రక్షితమూర్తి.
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ హైదరాబాద్ నగర పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించామని... హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 37 ప్రాంతాల్లో, 28 ప్రముఖ బ్లడ్ బ్యాంక్స్ సహకారంతో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్. విధి నిర్వహణలో దేశం, సమాజం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు నివాళిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు సజ్జనార్.
ప్రజల రక్షణకే పరిమితం కాకుండా, ప్రాణాలను కాపాడే సామాజిక సేవలోనూ పోలీసులు ముందుంటారనే సందేశాన్ని చాటడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నారు సజ్జనార్.
