హైదరాబాద్: వారణాసి, నాగ్‌పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం (అక్టోబర్ 29) గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓడిపోయాడన్నారు. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఉన్న నాగ్‌పూర్‌లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీని ఓడించిందన్నారు. కొట్టాలంటే కుంభస్థలాన్ని కొట్టాలని.. నాగ్‌పూర్‌లో అదే చేశామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ స్థానాలు ఎన్ని గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నది ముఖ్యమని వ్యాఖ్యానించారు.
మోడీ పాలనపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో వారణాసి ఫలితాలే చెబుతున్నాయన్నారు. వారణాసిలో బీజేపీ ఓటమికి మోడీ బాధ్యత వహించాలని.. నిజంగా ఆయనకు నైతికత ఉంటే తన వైఫల్యాలను అంగీకరించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే ప్రభుత్వానికి వ్యతిరేకత అని బీజేపీ నేతలు అంటున్నారు.. మరీ వారణాసిలో బీజేపీ ఓడితే మోడీ పాలనకు వ్యతిరేకం కాదా అని ప్రశ్నించారు.
బీజేపీకి కర్ణాటకలో ఒక నీతి.. వారణాసిలో మరో నీతా ఉంటుందా అని నిలదీశారు. ఆర్ఎస్ఎస్ గడ్డ నాగ్‌పూర్‌లోనే బీజేపీ సిద్ధాంతాలను ప్రజలు తిరస్కరించారన్నారు. యువత, చదువుకున్న వర్గాల్లో మోడీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందనడానికి ఈ ఫలితాలే నిదర్శమని పేర్కొన్నారు. లక్నో నుంచి పాట్నా వరకు బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్నారు.
యోగి సొంత ప్రాంతం గోరఖ్‌పూర్‌లో కేవలం 307 ఓట్లతో బీజేపీ గట్టెక్కిందని.. బీజేపీ అగ్రనేతల సొంత ప్రాంతాల్లోనే ఆ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు వస్తోందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడే దమ్ముంటే మోడీ ప్రెస్‌మీట్ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని అయి 12 ఏళ్లు దాటినా ఒక్కసారి కూడా ప్రెస్‌మీట్ పెట్టలేదు.. ప్రెస్‌మీట్ పెట్టలేని ప్రధాని ట్వీట్లు చేస్తూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మూడు అంకెల సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు ప్రజల మద్దతు పెరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 1న ఢిల్లీలో ఓటు చోరీకి వ్యతిరేకంగా భారీ నిరసన చేపడతామని.. బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఢిల్లీకి వేలాదిగా తరలివెళ్తామని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 13.3 కోట్ల ఓట్లను వెంటనే తిరిగి చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
