ఎల్నినో భయపెడుతోంది... వేసవి కాలం రాక ముందే నీటి ఎద్దడి కలవరపెడుతోంది. నీటిని పొదుపుగా వాడాలని సీఎం సహా మంత్రులు, అధికారులు సూచిస్తున్నప్పటికీ కొంతమందిలో మార్పు రావట్లేదు. రిజర్వాయర్లు అడుగంటుతున్నాయని వార్తలు వస్తున్నా కొంతమంది నీటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ క్రమంలో నీటి దుర్వినియోగానికి చెక్ చెప్పేందుకు రంగంలోకి దిగింది జలమండలి. హైదరాబాద్ లో నీటి దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు పానీ పేరుతో ప్రత్యేక యాప్ సిద్ధం చేసింది జలమండలి. గురువారం ( అక్టోబర్ 29 ) పానీ యాప్ న లాంచ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ఈ యాప్ ద్వారా హైదరాబాద్ నగర పౌరులను భాగం చేస్తూ నీటి దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్లాన్ చేసింది జలమండలి. పానీ యాప్ ద్వారా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది జలమండలి. నీటి సంరక్షణపై ఆసక్తి ఉన్న ప్రతి పౌరుడు సేవ్ వాటర్ వాలంటీర్ గా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది జలమండలి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైనా పైప్ లైన్ లీకేజీలు, ఓవర్ ఫ్లో ట్యాంకులు, వాణిజ్య అవసరాల కోసం తాగునీటిని వృధా చేయడం వంటివి చేస్తే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయచ్చని తెలిపింది జలమండలి. నీటి వృథాను ఫోటోలు తీసి యాప్ లో అప్ లోడ్ చేయచ్చని.. సదరు సమాచారం నేరుగా జలమండలి అధికారులకు అందుతుందని తెలిపింది జలమండలి.
