అతను తోపుతురుంఖాన్ జ్యోతిష్యుడు.. భవిష్యవాణి పేరుతో నార్త్ ఇండియా.. అదేనండీ హిందీ వాళ్లకు ఆయన చాలా ఫేమస్. ఆయన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకునేందుకు డబ్బులు కట్టి వారాలకు వారాలు వెయిట్ చేస్తుంటారు. అలాంటి జ్యోతిష్యుడు.. యూపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగాడు. తన భార్యను అభ్యర్థికి నిలబెట్టాడు.. విజయం తన భార్యదే అని.. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటూ ఎన్నికల ముందు ఢంకా బజాయించి మరీ చెప్పాడు.. పోలింగ్ అయిపోయింది.. కౌంటింగ్ పూర్తయ్యింది. తీరా చూస్తే భవిష్యవాణి చెప్పిన జ్యోతిష్యుడి భార్యకు జస్ట్ 300 అంటే 300 ఓట్లు మాత్రమే పడ్డాయి.. ఈ విషయం తెలిసిన సోషల్ మీడియా ఊరకే ఉంటుందా ఏంటీ.. ఏకిపారేస్తుంది.. సొంత పెళ్లాం జాతకం సరిగా చూడలేనివాడు.. మిగతా వాళ్లకు జ్యోతిష్యం ఎలా చెబుతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ ఆస్ట్రాలజర్ భార్య ఎన్నికల్లో పోటీకి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ జ్యోతిష్యుడు ఆచార్య ఇందు ప్రకాష్ మిశ్రా భార్య స్మితా మిశ్రా లక్నో డివిజన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటకట్టుకున్నారు. ఇతరుల భవిష్యత్తును అంచనా వేసి జోస్యం చెప్పే ఆచార్య ఇందు ప్రకాష్.. తన భార్య రాజకీయ భవితవ్యాన్ని మాత్రం అంచనా వేయలేకపోయారంటూ తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇతరులకు సమస్యల నుంచి బయటపడేందుకు ఎన్నో పరిహారాలు, పూజలు చెప్పే ఆయన.. కనీసం తన భార్య గెలుపు కోసం వాటిని ఎందుకు ఉపయోగించలేదంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తూ ఏకిపారేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం స్మితా మిశ్రా తీవ్రంగా శ్రమించారు. గ్రాడ్యుయేట్లు, యువత, విద్యాసంస్థల ప్రతినిధులను నేరుగా కలుస్తూ ప్రచారం నిర్వహించారు. నవయువక్ దళ్, కర్ణి సేన, బ్రాహ్మ సమాజ్ వంటి పలు సంస్థల మద్దతు కూడా కూడగట్టుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం ఆమెకు పూర్తిగా నిరాశను మిగిల్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమెకు కనీసం 300 ఓట్లు కూడా పడకపోవడం గమనార్హం.
ఈ పరాజయంపై స్పందించిన స్మితా మిశ్రా.. తాను జ్యోతిష్యుడైన తన భర్తను ఎప్పుడూ తన గెలుపు ఓటముల గురించి అడగలేదని చెప్పారు. తాను రాజకీయాల్లోకి పదవులు, అధికారాల కోసం రాలేదని, కేవలం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే పోటీ చేసినట్లు తెలిపారు.
తన ఓటమిపై స్మితా మిశ్రా అధికార యంత్రాంగంపై, ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగిందని, తమ ఏజెంట్లను లోపలికి రానివ్వకుండా బయటికి గెంటేశారని ఆరోపించారు. ఆన్లైన్లో సుమారు 22వేల దరఖాస్తులు సమర్పించినప్పటికీ ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చలేదని మండిపడ్డారు. ఎన్నికల సంఘానికి వందలాది ఫిర్యాదులు చేసినా ఎలాంటి స్పందన రాలేదని వాపోయారు. బీజేపీపై నమ్మకంతో ముందుకు వెళ్లామని.. కానీ ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాల వల్ల తీవ్ర నిరాశ చెందామన్నారు. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఆమె ప్రకటించారు. ఓటమి ఎదురైనా ఐపీ ఫౌండేషన్ ద్వారా తన సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇక ఆచార్య ఇందు ప్రకాష్ మిశ్రా విషయానికి వస్తే.. ఆయన తన అధికారిక వెబ్సైట్లో గతంలో పలు సంచలన జోస్యాలు చెప్పారు. నెల్సన్ మండెలా విడుదల, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, 9/11 ట్విన్ టవర్ల దాడి, భారత్ 7 పరుగుల తేడాతో వరల్డ్ కప్ గెలవడం వంటి కీలక అంచనాలు నిజమయ్యాయని ఆయన చెబుతుంటారు. అలాగే 2025 నవంబర్ 8న సంభవించిన భూకంపం గురించి కూడా ముందుగానే అంచనా వేశారు. ఇలాంటి ప్రముఖ జ్యోతిష్యుడి భార్యగా బరిలోకి దిగిన స్మితా మిశ్రాకు ఊహించని రీతిలో పరాభవం ఎదురుకావడం, కేవలం 300 ఓట్లు కూడా రాకపోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
