వారణాసి MLC ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో SP అభ్యర్థి : ఓటమి దిశగా బీజేపీ అభ్యర్థి

వారణాసి MLC ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో SP అభ్యర్థి : ఓటమి దిశగా బీజేపీ అభ్యర్థి

ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో బీజేపీ ఓడిపోయింది. అవును.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో.. ఓటమిని అంగీకరించింది బీజేపీ. 21 రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత.. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అశుతోష్ సిన్హా 52 వేల 60 ఓట్ల సాధించారు. బీజేపీకి చెందిన కేదార్ నాథ్ సింగ్ 34 వేల 766 ఓట్లు సాధించారు. ఇద్దరి మధ్య 17 వేల ఓట్ల తేడా ఉండటంతో.. ఓటమి అంగీకరిస్తూ.. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు బీజేపీ అభ్యర్థి కేధార్ నాథ్ సింగ్. 

కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకెళ్లిన బీజేపీ అభ్యర్థి: 

కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన బీజేపీ అభ్యర్థి కేధార్ నాథ్ సింగ్.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఫలితంపై స్పందించారు. ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన బీజేపీ కార్యకర్తలు, ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. వారణాసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) గెలవటం ఇది రెండో సారి. 2020 ఎన్నికల్లో ఈ స్థానాన్ని సమాజ్ వాదీ పార్టీనే గెలుచుకున్నది. వారణాసి గ్రాడ్యుయేట్ ఓటర్లలో తన పట్టును నిలుపుకున్నది ఎస్పీ. 

వారణాసిలో సమాజ్ వాదీ పార్టీ గెలుపు: 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 11 టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించగా.. వారణాసితో కలుపుకుని సమాజ్ వాదీ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది. వారణాసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఓట్ల లెక్కింపు విషయంపై కంప్లయింట్స్ రావటం కొంత సమయం కౌంటింగ్ నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు కొనసాగించారు అధికారులు. రెండు రోజుల తర్వాత.. మూడో రోజు మధ్యాహ్నం 3 గంటల సమయానికి.. 21 రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత 17 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అశుతోష్ సిన్హా. 

సమాజ్ వాదీ పార్టీ సంబరాలు: 

ప్రతి రౌండ్ లోనూ ఎస్పీ పార్టీ అభ్యర్థి లీడ్ లో ఉండటంతోపాటు 17 వేల ఓట్ల భారీ తేడా ఉండటంతో.. బీజేపీ అభ్యర్థి కేధార్ నాథ్ సింగ్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోవటమే కాకుండా.. ఓటమిని అంగీకరిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ పరిణామంతో వారణాసిలో ఎస్పీ పార్టీ సంబురాలు చేసుకుంటుంది. వారణాసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో సమాజ్ వాదీ పార్టీ గెలిచినట్లు.. ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.