న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సైబర్ మోసాలకు బ్యాంకులే బాధ్యత వహించాలని ఆదేశించింది. అసాధారణ లావాదేవీలపై బ్యాంకులు పోలీసులను అప్రమత్తం చేయాలని సూచించింది. తమ ఖాతాదారులను రక్షించడం బ్యాంకుల బాధ్యత అని దేశసర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సైబర్ మోసాల్లో బాధితుల రూ.800 కోట్లు నష్టపోవడం ఆందోళనకరమని పేర్కొంది.
డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గురువారం (అక్టోబర్ 29) సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్ బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. డిజిటల్ అరెస్ట్, సైబర్ మోసాల బారిన పడే వినియోగదారులకు రక్షణగా నిలవడంలో బ్యాంకులు తగిన శ్రద్ధ వహించడంలో విఫలమైతే బాధితులకు జరిగిన పూర్తి నష్టాన్ని బ్యాంకులు నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బ్యాంకులు తమ బాధ్యతల నుంచి తప్పుకోలేవని దేశసర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
పెన్షనర్లు లేదా వృద్ధుల ఖాతాల నుంచి అనుమానస్పదంగా పెద్ద మొత్తంలో విత్డ్రాల్స్ జరుగుతున్నప్పుడు బ్యాంకులు ఎందుకు జోక్యం చేసుకోకూడదని ప్రశ్నించింది. అనుమానాస్పద లావాదేవీలను తాత్కాలికంగా హోల్డ్‌లో ఉంచే మెకానిజం ఉండాలని సూచించింది. తమ వినియోదారుడు మోసపోతున్నాడని అనుమానం వస్తే బ్యాంకులు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ఆటోమేటిక్ అలర్ట్ పంపాలని... ఆపై భౌతిక ధృవీకరణ చేయాలని ఆదేశించింది. బ్యాంకులు కేవలం లాభాల కోసమే కాకుండా వినియోగదారుల సొమ్ముకు బాధ్యతాయుతమైన రక్షణ కవచంలా వ్యవహరించాలని పేర్కొంది
సైబర్ మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిన నూతన నో యువర్ కస్టమర్ అమెండ్మెంట్ డైరెక్షన్స్ 2026 మార్గదర్శకాలను సుప్రీంకోర్టు పరిశీలించనుంది. 2026, డిసెంబర్ 31 నాటికి అమలులోకి రానున్న ఈ నిబంధనలలో బ్యాంకుల బాధ్యతను, బాధితులకు నష్టపరిహారం చెల్లించే కఠినమైన నిబంధనలను తప్పనిసరిగా చేర్చాలని ఆర్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
